సాక్షి, హైదరాబాద్: అనేక వివాదాలతో ఆలస్యమైన 2011 గ్రూపు–1 కథ ఎట్టకేలకు ముగిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ మెయిన్స్ పరీక్షలు, ఇంటర్వ్యూలను నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ శనివారం ఫలితాలను విడుదల చేసింది. 121 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. మొత్తంగా 127 పోస్టులు ఉండగా, ఆరు పోస్టులకు దివ్యాంగ అభ్యర్థులు అందుబాటులో లేరు.
దీంతో 121 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ వెల్లడించారు. 2011లో నోటిఫికేషన్ జారీ చేసిన గ్రూపు–1 ప్రిలిమ్స్ రాత పరీక్ష కీలలో తప్పుల కారణంగా అభ్యర్థులు అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పటి ఏపీపీఎస్సీ కేసు కోర్టులో ఉండగానే మెయిన్స్ పరీక్షలను నిర్వహించింది. దీనిపైనా అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.
ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆ మెయిన్ పరీక్షలను రద్దు చేసి మళ్లీ పరీక్షలను నిర్వహించి ఇంటర్వ్యూలు చేయాలని స్పష్టం చేసింది. ఈలోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రానికి వచ్చిన 127 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ 2016 సెప్టెంబర్ 14 నుంచి 24 వరకు అర్హులైన 8,760 మందికి మెయిన్స్ పరీక్షలను నిర్వహించింది.
అందులో అర్హత సాధించిన వారికి ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 10 వరకు ఇంటర్వ్యూలను నిర్వహించింది. తాజాగా ఫలితాలను ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్ల వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment