సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు పనులకు వస్తు సేవల పన్ను(జీఎస్టీ) విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తీపి కబురు అందింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు లాంటి పథకాలకు అవసరమయ్యే లేబర్ కాంపొనెంట్‌పై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించే అవకాశాలున్నాయని కేంద్రం నుంచి సమాచారం అందిందని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 6న ఢిల్లీలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వాస్తవానికి కాంట్రాక్టు పనులపై జీఎస్టీని 18 శాతంగా కేంద్రం తొలుత నిర్ధారించింది. గతంలో కాంట్రాక్టు పనులపై 5 శాతం వ్యాట్ ఉండగా, అది 18 శాతానికి పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వం షాక్‌కు గురైంది.
దీనిపై సీఎం కేసీఆర్‌తో పాటు ఆర్థిక మంత్రి ఈటల, మంత్రి కేటీఆర్, వాణిజ్య పన్నుల అధికారులు కేంద్రానికి అనేక వినతులు పంపారు. దీంతో జీఎస్టీని 12 శాతానికి తగ్గించింది. ఆ తర్వాత జరిగిన కౌన్సిల్ సమావేశంలోనూ రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలను గట్టిగానే వినిపించింది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి తాజాగా లేబర్ కాంపొనెంట్ విషయం తెలియడంతో కొంత ఊపిరి పీల్చుకున్నట్టయింది. లేబర్ కాంపొనెంట్‌పై జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో రూ.2 వేల నుంచి 3 వేల కోట్ల వరకు ఉపశమనం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. జీఎస్టీ కౌన్సిల్ భేటీలో అధికారిక ప్రకటన కోసం గంపెడాశతో ఎదురుచూస్తోంది.
కాంట్రాక్టు పనులకు జీఎస్టీ ‘ఊరట’
Published Thu, Oct 5 2017 3:44 AM | Last Updated on Thu, Oct 5 2017 3:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment