ముల్కల్ల శివారులో పంట పొలంలో ఒరిగి ఉన్న విద్యుత్ స్తంభం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోతే కానీ అధికారులు స్పందించేలా లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు అధికారులపై మండిపడుతున్నారు. హాజీపూర్ మండలం గుడిపేట సబ్‌స్టేషన్ పరిధిలో గల గంగొడ్డు పల్లెకు చెందిన రైతులు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల వర్షాకాలం పంటలు సాగు చేసుకోలేని దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రెండు నెలలుగా కరెంటు స్తంభాలు సరిచేయాలని అధికారులకు విన్నవించినా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు. ఒరిగిన స్తంభాలతో పొలాల్లో నారు పోసుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. తమ గోడు ఎవరికి చెప్పాలో పాలుపోవడం లేదని అంటున్నారు. రైతులంతా బిజీగా ఉంటే తమ పొలంలో ఉన్న విద్యుత్ స్తంభాలు సరి చేయించకపోవడంతో పంట సాగు చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 11 కేవీ విద్యుత్‌లైన్ కావడంతో 3 ఫేజ్ విద్యుత్ సరఫరా ఉందని దీంతో పడిపోయిన, ఒరిగి ఉన్న విద్యుత్ పోల్స్ దగ్గరికి వెళ్లాలంటేనే భయంగా ఉందని రైతులు అంటున్నారు. గతంలో ఓ వ్యక్తి ఇక్కడ విద్యుత్ షాక్‌తో చనిపోయాడని గుర్తు చేశారు.
పట్టించుకునే వారేరీ?
కిందపడిపోయి, ఒరిగి ఉన్న స్తంభాలతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. సార్లకు పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. చెబితే వచ్చి వెళ్లారు. పని మాత్రం చేయలేదు. డబ్బులు ఇవ్వడం లేదని చేయడానికి వస్తలేరు కావచ్చు. సార్లు రాని కారణంగా పంట సాగు చేసుకోలేకపోతున్నాం. నారుపోసుకునే సమయం ఆసన్నమైంది ఏం చేయాలో పాలుపోవడం లేదు. తిరుపతి, ముల్కల్ల
Comments
Please login to add a commentAdd a comment