
సాక్షి, సిద్ధిపేట: ఆర్థికమాంద్యం, బడ్జెట్ లోటు ఉన్నా కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎక్కడా బెదరకుండా సంక్షేమాన్ని కొనసాగిస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్ ప్టటణంలో ఆడపడుచులకు హరీశ్ రావు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రోజా శర్మ, జేసీ పద్మాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. జిల్లాలోని 3,65,225 మంది ఆడపడుచులకు బతుకమ్మచీరల పంపిచేస్తున్నామన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇంటింటికి వెళ్లి అర్హులైన వారికి చీరలు పంపిణీ చేయాలని ఆయన సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు.
గ్రామాలలో మంచినీళ్లకు ఇబ్బందులు లేకుండా మిషన్ భగీరథతో ఆడపడుచుల కనీళ్లు తుడిచిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికి కేసీఆర్ కిట్, కళ్యాల లక్ష్మి, ఆసరా పెన్షన్లకు ఎలాంటి ఆటంకం లేకుండా అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చేసి కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఓర్వలేక పోతున్నారని.. అందుకే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని హరీష్ రావు మండి పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment