![ఏవో, ఏఈవో, హెచ్‌వో పోస్టుల భర్తీకి - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/81483649416_625x300.jpg.webp?itok=CHHbUxaB)
ఏవో, ఏఈవో, హెచ్‌వో పోస్టుల భర్తీకి
హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రత్యేక వెయిటేజీకి నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయాధికారులు (ఏవో), వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈ వో), ఉద్యానవన అధికారుల (హెచ్‌వో) పోస్టుల భర్తీకి ఉమ్మడి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీ సమయంలో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులతో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు మార్కులు వస్తే, అటువంటి సందర్భాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రాధాన్యతనివ్వాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయ మూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాం ప్రసాద్‌ల ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. వ్యవసాయాధి కారులు, విస్తరణాధికారులు, ఉద్యానవన అధికారుల పోస్టుల భర్తీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పలువురు కాంట్రాక్ట్ ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
పోస్టుల భర్తీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలని, ఆ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం, రాత పరీక్షకు అనుమతినిస్తూ ఫలితాలను వెల్లడించవద్దని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఆదేశించింది. తరువాత వీటిపై సుదీర్ఘ విచారణ జరిపి తీర్పును వాయిదా వేసిన ధర్మాసనం గురువారం తన నిర్ణయాన్ని వెలువరించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రత్యేక వెయిటేజీ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. అయితే మిగిలిన అభ్యర్థులతో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు మార్కులు వస్తే, అటువంటి సందర్భాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రాధాన్యతనివ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది.