వారంపాటు నగదు విత్‌డ్రా చేయం
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు.. ఆపై నెలారంభం కావడంతో సామాన్యులకు కొంత మేరకైనా సాయం చేయాలన్న ఉద్దేశంతో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వారం రోజులదాకా తమ జీతాలకు సంబంధించిన డబ్బును తమ ఖాతాల నుంచి తీసుకోరాదని నిర్ణయించుకున్నారు. న్యాయమూర్తులందరూ గురువారం స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైకోర్టు న్యాయమూర్తులు, ఉద్యోగులకు హైకోర్టులోని ఎస్‌బీహెచ్‌లో జీతాల ఖాతాలున్నాయి. ఒక్కో వ్యక్తి వారానికి రూ.24వేలు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.
ఈ నేపథ్యంలో 22 మంది న్యాయమూర్తులు తమ తమ ఖాతాల నుంచి ఆ మొత్తాలను ఉపసంహరించుకుంటే ఉద్యోగులకు నగదు సమస్యలు ఏర్పడతాయని, అందువల్ల ఓ వారం రోజులపాటు నగదు ఉపసంహరణ చేయకుండా ఉంటే కనీసం హైకోర్టు ఉద్యోగులకు కొంత మేరైనా సాయం చేసినట్లు ఉంటుందని భావించిన న్యాయమూర్తులు ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే తమ ఉద్యోగులకు జీతాలు అందించేందుకు హైకోర్టు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అటెండర్లకు రూ.10వేలు, మిగిలిన ఉద్యోగులు, అధికారులకు రూ.8వేల నగదు అందచేయనున్నది.