
సాక్షి, హైదరాబాద్: కాకినాడలోని శ్రీపీఠం వ్యవస్థాపకుడుపరిపూర్ణానంద స్వామి హైదరాబాద్ నగర బహిష్కరణ అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే జారీ చేయడానికి హైకోర్టు నిరాకరించింది. నగర బహిష్కరణ కొనసాగింపునకు వీలుగా తెలంగాణ హోంశాఖ ముఖ్యకార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాలను సోమవారం హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ వ్యవహారంలో స్వామీజీకి గతంలో జారీ చేసిన నోటీసు అందాల్సి ఉందని, దానిని పరిశీలించాక ఈ అప్పీల్‌పై విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం ప్రకటించింది.
కరీంనగర్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో స్వామీజీ రెచ్చగొట్టేవిధంగా ప్రసంగించినందుకే నగర బహిష్కరణ చేస్తూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు విడివిడిగా ఉత్తర్వులిచ్చాయని, వీటి అమలును నిలుపుదల చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉతర్వులపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావు వాదించారు. యాత్ర పేరుతో అనుమతులు తీసుకుని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై పరిపూర్ణానంద స్వామి వాదనలు వినాల్సి ఉందని, ఇప్పటికే స్వామీజికి ఇచ్చిన నోటీసు అందాల్సి ఉన్నందున ఈ పరిస్థితుల్లో స్టే ఆదేశాలు జారీ చేయబోమని ధర్మాసనం ప్రకటించింది. విచారణ వాయిదా పడింది.