హెచ్‌సీయూలో ఎన్నికలు ప్రశాంతం
- నేడు ఓట్ల లెక్కింపు
సెంట్రల్ యూనివర్సిటీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. వర్సిటీలోని పలు విభాగాల్లోని 20 పోలింగ్ బూతుల్లో పోలింగ్ నిర్వహించగా 80 శాతం పోలింగ్ నమోదైంది. దాదాపు 60 మంది ఉద్యోగులు, 50 మంది భద్రతా సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొన్నారు.
భవితవ్యం తేలేది నేడే..
హెచ్‌సీయూ ఎన్నికల్లో నాలుగు ప్రధాన విద్యార్థి సంఘాలు పోటీపడ్డాయి. తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (టీఆర్‌ఎస్‌వీ) ఏర్పడిన 13 రోజులకే ఆరు పదవులకు పోటీ చేసింది. అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్, బహుజన స్టూడెంట్ ఫ్రంట్, ఎన్‌ఎస్‌యూఐ, ట్రైబల్ స్టూడెంట్ ఫోరాలు యునెటైడ్ డెమోక్రటిక్ అలయన్స్ (యూడీఏ) గా ఏర్పడ్డాయి. అధికార సంఘ లోపాలను ఎత్తి చూపుతూ ఏబీవీపీ రంగంలోకి దిగింది. గత రెండు పర్యాయాలు వరుస విజయాలు దక్కించుకున్న ఎస్‌ఎఫ్‌ఐ మరోమారు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ బాగా జరిగిందని విద్యార్థి సంఘాలు వాపోయాయి. అధ్యక్ష పదవికి దీపక్ కుమార్ సింగ్ (ఎస్‌ఎఫ్‌ఐ), రాం అభినవ్ తేజ్ (టీఆర్‌ఎస్‌వీ), విన్సెంట్ (యూడీఏ), కీర్తన (ఏబీవీపీ) పోటీ చేశారు.