
జనగామ: జనగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేని లోటును తీరుస్తూ ఎంపీగా తన బాధ్యతలను నిర్వర్తిస్తానని భువనగిరి లోక్‌సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఎంపీగా గెలుపొందిన తర్వాత శనివారం జనగామకు వచ్చిన ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. వేలాది మందికి ఉపాధిని కల్పించేందుకు ఐటీఐఆర్ ఇండస్ట్రీస్‌ను జనగామకు తీసుకువచ్చేందుకు కేంద్రంతో చర్చిస్తామన్నారు. జనగామ నియోజకవర్గం నుంచి మొదటి యాత్రను త్వరలోనే ప్రారంభిస్తానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఐదు నెలలు గడవక ముందే కేసీఆర్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయాడన్నారు.
వందల కోట్లు ఖర్చు చేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా టీఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్మలేదన్నారు. ఎలక్షన్‌లో యంత్రాలను మాయచేసి టీఆర్‌ఎస్, బీజేపీ అధికారంలోకి వచ్చాయని ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ రెండోసారి సీఎంగా గెలుపొందిన తర్వాత 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే ఎంపీ ఎలక్షన్‌లో తాము ముగ్గురం గెలుపొందామన్నారు. నిజామాబాద్‌లో కవిత ఓటమికి నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్‌లు గెలుపొంది నెలలు గడిచిపోతున్నా వారికి చెక్‌పవర్ లేదని, వారం రోజుల్లో వారికి చెక్‌పవర్ ఇవ్వని పక్షంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.