
హైదరాబాద్ : ఉన్నతాధికారుల వేధింపులతో ఆత్మహత్యకు యత్నించిన హెడ్‌కానిస్టేబుల్ కొరిపెల్లి దామోదర్‌రెడ్డి(57) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఎమర్జెన్సీ వార్డులో వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నామని, మరో 48 గంటలు దాటితేగాని ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని ఎల్‌బీనగర్‌లోని కామినేని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రసాద్‌రావు తెలిపారు. దామోదర్‌రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
కాగా, కుటుంబ తగాదా విషయంలో దామోదర్‌రెడ్డిని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు పిలిచి తోటి ఉద్యోగుల ఎదుట దూషించి దాడికి పాల్పడ్డ ఎస్‌ఐ లవకుమార్‌పై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు జ్యోతి, విక్రంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 14న విధి నిర్వహణలో ఉన్న దామోదర్‌రెడ్డిపై దాడి చేసిన ఎస్‌ఐపై చర్య తీసుకోవాలని ఉన్నతాధికారులకు విన్నవించినా స్పందించలేదని, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదన్నారు. ఎస్‌ఐ తీరుతో మనస్తాపం చెందిన దామోదర్‌రెడ్డి శుక్రవారం ఆత్మహత్యకు యత్నించారని పేర్కొన్నారు. ఆత్మహత్యకు యత్నించినప్పుడు తన జేబులో ఉన్న సూసైడ్ నోటును మాయం చేశారని ఆరోపించారు.