నగరంలో కుండపోత | heavvy rains in madinaguda | Sakshi
Sakshi News home page

నగరంలో కుండపోత

Published Mon, Aug 28 2017 1:46 AM | Last Updated on Tue, Sep 12 2017 1:07 AM

heavvy rains in madinaguda

జల దిగ్బంధంలోనే అపార్ట్‌మెంట్లు
సాక్షి, హైదరాబాద్‌: అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఆదివారం గ్రేటర్‌ పరిధిలో కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి పొద్దు పోయే వరకు కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, జీడిమెట్ల, మియాపూర్, మల్కాజ్‌గిరి, కుషాయిగూడ, వెస్ట్‌ మారేడ్‌పల్లి, కాప్రా, తిరుమలగిరి, అల్వాల్, ఈసీఐఎల్, చర్లపల్లిలో భారీగా వర్షం కురిసింది. సికిం ద్రాబాద్‌ పరిధిలోని ఓయూ క్యాంపస్, తార్నాక, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, పద్మారావునగర్, పార్శీగుట్ట, వారాసిగూడ, చిలకలగూడ, సీతాఫల్‌మండి, మారేడ్‌పల్లి, మోండా మార్కెట్, ప్యాట్నీ, బేగంపేట ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రధాన రహదారులపై నడుము లోతు వరద నీరు పోటెత్తింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతా ల్లోని బస్తీల్లో ఇళ్లలోకి చేరిన నీటిని తొల గించేందుకు స్థానికులు అవస్థలు పడ్డారు.  కాగా, దీప్తీశ్రీనగర్‌ పరిసర ప్రాంతాలు ముంపునకు గురి కావడంతో కాలనీలు, నాలాలు, అపార్ట్‌మెంట్‌లను జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆదివారం పరిశీలించారు.

ఇంకా తేరుకోని మదీనాగూడ..
వర్ష బీభత్సంతో అతలాకుతలమైన మదీనా గూడ, దీప్తీశ్రీనగర్‌ ప్రాంతాలు ఇంకా తేరు కోలేదు. మదీనాగూడలోని ఉషోదయ అపా ర్ట్‌మెంట్, పొట్లపల్లి పవిత్ర అపార్ట్‌మెంట్, సాయితేజ ఫ్రైడ్స్, తులసీరాం కాంప్లెక్స్‌తో పాటు మరో 2 అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లూ వర్షపు నీటిలోనే ఉన్నాయి. నీటిని ఇంజిన్లతో తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు.

చేపల వేట
మదీనాగూడలోని ఖాళీ స్థలంలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ వరద నాలాల ద్వారా గంగారం చెరువులోకి చేరుతుంది. చెరువులోని చేపలు ఖాళీ స్థలంలోని నీటిలోకి  వస్తున్నాయి. యువత వలలు వేసి చేపలను పట్టుకోవడం సందడిగా మారింది.

నేడు, రేపు భారీ వర్షాలు
ఓవైపు ఉత్తర భారతం నుంచి ఒరిస్సా వరకు రుతుపవన ద్రోణి, మరోవైపు ఉపరితల ఆవర్తనం రెండూ కలవడంతో రుతుపవనాలు ఊపందు కున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి తెలిపారు. దీంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. తర్వాత రెండు రోజులు సాధారణ వర్షపాతం నమోదవొచ్చన్నారు. ఉపరితల ఆవర్తనం సోమవారం అల్పపీడనంగా మారే అవకాశముందని, అదే జరిగితే మరిన్ని రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని చెప్పారు. గతేడాది సెప్టెంబర్‌లో కుండపోత వర్షాలు కురిశాయని, దీంతో లోటు వర్షపాతం కాస్తా అధిక వర్షపాతానికి చేరుకుందని, కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఉండక పోవచ్చని పేర్కొన్నారు. వచ్చే నెలాఖరు వరకు నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుందని, ఒక్కోసారి అక్టోబర్‌ 15 వరకూ విస్తరించే అవకాశాలున్నాయని తెలిపారు.

ఆ తర్వాతే ఈశాన్య రుతుపవ నాలు మొదలవుతాయన్నారు. కాగా, గత 24 గంటల్లో భూపాలపల్లిలో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కొత్తగూడెంలో 6, దోమలో 5, మక్లూరు, అలంపూర్‌లలో 4, లింగంపేట, గట్టు, చెన్నూరు, ములుగు, వర్ని, కొల్హాపూర్‌లలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల తో వరి నాట్లు ఊపందుకున్నాయని, 4 రోజుల క్రితం 66 శాతమున్న నాట్లు ఈ నెలాఖరుకు 80 శాతానికిపైగా పెరగొచ్చని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో అక్కడక్కడ పెసర పంట దెబ్బతినొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement