
పక్కోళ్లకే పెద్దపీట !
మన రైతులకు మొండిచేయి
ఏనుమాముల మార్కెట్‌కు
ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా పత్తి దిగుమతి
ఏజెంట్ల సహకారంతో గరిష్ట ధరతో కొనుగోళ్లు
అడ్డగోలు కొర్రీలతో స్థానిక రైతులకు ఇబ్బందులు
పోచమ్మమైదాన్ : ఆసియూలోనే అతిపెద్దదైన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈ ఏడాదీ పత్తి జీరో దందాకు అడ్డులేకుండా పోయింది. దళారుల మాయాజాలంలో పడి సీసీఐ చోద్యం చూస్తోంది. తేమ శాతం, దూది పింజ పొడవు పేర మద్దతు ధర తెగ్గోస్తే, తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పత్తిని కొంటూ... స్థానికులు తెచ్చే తెల్లబంగారానికి రంగు, నాణ్యత తగ్గిందంటూ కొర్రీలు పెడ్తూ... దోపిడీ చేస్తున్నారు. స్థానిక రైతుల పేరిట దొంగ పట్టా పాసు పుస్తకాలు సృష్టించి... అధికారుల సహకారంతో ఇక్కడి రైతులను మోసగిస్తున్నారు.
60 శాతానికి పైగా ఏపీ పత్తి రాక
ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ వాహనాల్లో పత్తి జిల్లా మార్కెట్‌ను ముంచెత్తుతోంది. ఇక్కడికి వస్తున్న పత్తిలో దాదాపు 60 శాతం పత్తి దళారుల నుంచే వస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి వస్తున్న పత్తికి సంబంధించి దళారులు మలుగు, పరకాల, తొర్రూరు మండలాల రైతుల పేర్లు నమోదు చేసి విక్రయిస్తున్నారు.
వరంగల్‌లో ఏజెంట్లు
మన పక్క రాష్ట్రంలో సైతం సీసీఐ కోనుగోలు కేంద్రాలు ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి భారీ వాహనాల్లో పత్తిని ఇక్కడకు తీసుక వస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో ఏజెంటలను నియమించుకున్నారు. అక్కడి నుంచి దిగుమతి అవుతున్న పత్తి సరియైన నాణ్యత లేకున్నా... ఏజెంట్ల సహకారంతో సీసీఐ అధికారులు నంబర్ వన్ ధర పెట్టడంపై రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ఏపీ నుంచి వచ్చిన పత్తికి అధిక ధర పెట్టి కొనుగోలు చేస్తుండడం.. స్థానిక రైతులకు తేమ శాతం.... దూది పింజ శాతం... నాణ్యత (మైక్ వ్యాల్యూ) అంటూ కొర్రీలు పెడుతూ ధరలో కోత పెట్టడం వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
ఏపీ నుంచి 24,000 బస్తాల రాక
వరంగల్ మార్కెట్‌కు శుక్రవారం మొత్తం సుమారు 40,000 బస్తాలు వచ్చారుు. ఇందులో దాదాపు 24,000 బస్తాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చినవేనని తెలుస్తోంది. ఆ రాష్ట్రానికి సంబంధించిన ఏజెంట్లు చక్రం తిప్పి త్వరత్వరగా కొనుగోళ్లు జరిగేలా చూడడమే కాకుండా... దాదాపు అన్నింటికి నం బర్ వన్ ధర క్వింటాల్‌కు రూ.4050 పెట్టినట్లు స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. అదే జిల్లా రైతులకు రూ. 3,969, రూ.3,888 మాత్రమే పెట్టా రు. కాగా, కొనుగోళ్లకు సం బంధించి సీసీఐ ప్రతినిధిని శర్మను సంప్రదిం చగా, ‘ఎక్కడి నుంచి పత్తి వస్తుం దనే విషయం మార్కెట్ వారు చూసుకోవాలి. ‘ఇతర ప్రాంతాల నుంచి పత్తి వస్తున్న మాట నిజమే. కానీ, పట్టా పాస్ పుస్తకాలు ఇక్కడివే తీసుకువస్తున్నారు. వారిని గుర్తించలేకపోతున్నా’మని మార్కెట్ కమిటీ చెర్మైన్ వినోద్ కుమార్ అనడం గమనార్హం.