కృష్ణమ్మ జల పరవళ్లు కొనసాగుతున్నాయి. బిరబిరా అంటూ శ్రీశైలం నుంచి సాగర్‌కు పరుగెడుతోంది. ఎగువనుంచి భారీగా వర ద రావడంతో శనివారం శ్రీశైలం జలాశయానికి నీటిరాక పెరగడంతో ఏడుగేట్లు 10 అడుగులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. రేడియల్ క్రస్ట్‌గేట్లు, విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా మొత్తంగా 2,71,712 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు వస్తోంది.
నాగార్జునసాగర్ : సాగర్ జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి 2,71,712 క్యూసెక్కుల వరదనీటిని విడుదల చేస్తుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ సాగర్ జలాశయానికి చేరుతోంది. దీంతో క్రమంగా జలాశయం నీటిమట్టం పెరుగుతోంది. శనివారం సాయంత్రం ఆరుగంటలకు సాగర్ జలాశయం నీటిమట్టం 540.30 అడుగులకు చేరింది. ఇది 188.9530 టీఎంసీలకు సమానం. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా 312.24 టీఎంసీల నీరు నిలువ ఉంటుంది. శ్రీశైలం జలాశయం గరిష్టస్థాయిలో నిండటంతో పైనుంచి వస్తున్న నీటిని రేడియల్ క్రస్ట్‌గేట్లు, విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా దిగువకు వదులుతున్నారు.
శనివారం 11 గంటలకు శ్రీశైలం జలాశయానికి నీటిరాక పెరగడంతో ఏడుగేట్లు 10 అడుగులు ఎత్తి దిగువకు 1,94,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇదే విధంగా వారం, పదిరోజుల పాటు నీరు వస్తే సాగర్ జలాశయం గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నాలుగు రోజులు మాత్రం ఈ ప్రవాహం ఉండే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. కృష్ణా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో గల ప్రాజెక్టులు వర్షాకాలం ప్రారంభంలోనే పూర్తిస్థాయిలో నిండటంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వచ్చే వరదను ఎప్పటికప్పుడు దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు అత్యధికంగా వరదనీరు వచ్చి చేరుతుండగా ఆ నీటినంతా శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు.
వారంరోజులు ఇన్‌ఫ్లో వస్తే నిండనున్న సాగర్
వారంరోజుల పాటు నిత్యం రెండు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరితే సాగర్ జలాశయం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. సాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండాలంటే 124 టీఎంసీల నీరు రావాల్సి ఉంటుంది. ఒక టీఎంసీ 11,575 క్యూసెక్కుల నీటికి సమానం. ఏడురోజుల పాటు రెండు లక్షలు వస్తే 14,35,300 క్యూసెక్కుల నీరు వచ్చి చేరనుంది.
Comments
Please login to add a commentAdd a comment