
సాక్షి, హైదరాబాద్: నగరంలో వానొస్తే రోడ్డు చెరువులవుతున్నాయి. ఎక్కడికక్కడే నిలిచిపోయిన నీటితో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఏళ్ల తరబడి ఈ సమస్యలున్నా ఇప్పటి వరకు శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోలేకపోయారు. ఈ సీజన్‌లో కురిసిన తొలి వర్షాలతోనే తీవ్ర ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడటంతో జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు పరిష్కార చర్యలకు శ్రీకారం చుట్టారు.
మరోవైపు జేఎన్‌టీయూ నిపుణులతో అధ్యయనం చేయించి పరిష్కారాలు కోరారు. ప్రస్తుతం నగరంలో 123 మేజర్ లాగింగ్ ఏరియాలున్నాయి. వీటిల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే అత్యధికంగా 82 ఉండగా, వాటికి కారణాలేమిటో తెలియాల్సి ఉంది. మిగతా రెండు కార్పొరేషన్ల పరిధిలో ఫ్లై ఓవర్లు తదితర నిర్మాణ పనులతో రోడ్డు ఇరుగ్గామారి, రోడ్డు లోలెవెల్ ఉండి, వరదపోయే మార్గాల్లేక ముంపు సమస్యలు ఏర్పడుతున్నాయని గుర్తించారు. ఇవి కాక ఇతరత్రా కారణలతోనూ రోడ్లపై నీరు నిల్వ ఉంటోంది.