రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందని అత్తింటి వారు వేధిస్తుండటంతో మనస్తాపానికి గురై వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
సైదాబాద్: రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందని అత్తింటి వారు వేధిస్తుండటంతో మనస్తాపానికి గురై వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చంపాపేట పరిధిలోని బాలాజీనగర్‌లో బుధవారం జరిగింది. రంగారెడ్డిజిల్లా గండేడు మండలం అచ్చెనపల్లికి చెందిన బాల గోవర్దన్‌రెడ్డితో మహబూబ్‌నగర్ జిల్లా తిరుమలగిరికి చెందిన కృష్ణవేణి(22)కి మూడేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు అక్షిత(2), పుట్టి(25 రోజులు) ఉన్నారు. వీరు ఐఎస్ సదన్ డివిజన్ చంపాపేట పరిధిలోని బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్నారు. గోవర్దన్ ఆటో నడుపుతూ జీవస్తున్నాడు.
కాగా కృష్ణవేణికి రెండో కాన్పులో ఆడపిల్ల పుట్టడంతో అత్తింటి వారి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో గత కొద్ది రోజులుగా వేధింపులు ఎక్కువ కావడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా మారని భర్త భార్యను చితకబాది తిరిగి నగరానికి తీసుకొచ్చాడు. ఇంట్లో సూటి పోటి మాటలతో వేధిస్తుండటంతో కృష్ణవేణి బుధవారం గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామ నిర్వహించారు. మృతురాలి భర్తతో పాటు కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్త, భర్తలు కలిసి కృష్ణవేణిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ మృతురాలి సోదరుడు కృష్ణారెడ్డి సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.