దాగుడుమూతలు | Hidden deficit to surplus | Sakshi
Sakshi News home page

దాగుడుమూతలు

Published Thu, Mar 12 2015 1:24 AM | Last Updated on Mon, Mar 25 2019 3:09 PM

దాగుడుమూతలు - Sakshi

దాగుడుమూతలు

ఆదాయ వనరుల్లో లోటు ఉన్నా.. తెలంగాణ మిగులు రాష్ట్రంగా చెప్పుకునేందుకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అంకెల గారడీ చేశారు.

  • లోటును దాచి మిగులు
  •  ప్రసంగంలో రూ. 20,277 కోట్ల లోటు ప్రస్తావన
  •  రాష్ట్రం తప్పేమీ లేదు...తప్పంతా కేంద్రానిదే: ఈటెల
  •  లోటును చూపించకుండాబడ్జెట్ గణాంకాల్లో దాటవేత
  •  నిరుటి అంచనాలనే సవరణలుగా చూపించి గారడీ
  • సాక్షి, హైదరాబాద్: ఆదాయ వనరుల్లో లోటు ఉన్నా.. తెలంగాణ మిగులు రాష్ట్రంగా చెప్పుకునేందుకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అంకెల గారడీ చేశారు. 2014-15 బడ్జెట్ అంచనాలకు సంబంధించిన రాష్ట్ర ఆదాయ వనరుల్లో రూ.20,277 కోట్ల లోటు ఉందని స్వయంగా వెల్లడించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం  తప్పేమీ లేదని.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు బాగా తగ్గినట్లు తన ప్రసంగంలో విశ్లేషించారు. కానీ.. ఈ లోటు మేరకు నిరుటి బడ్జెట్‌ను సవరించారా.. లేదా..? దీని ప్రభావం ఏయే రంగాలపై పడింది.. ఏయే విభాగాలు, పథకాలకు  కేటాయింపులు తగ్గాయి..? అనే వివరాలను శాసనసభకు సమర్పించకుండా గోప్యంగా ఉంచారు. కనీసం ఆ మేరకు లోటును సవరించిన బడ్జెట్ గణాంకాలను పొందుపరచకుండా దాట వేశారు. బడ్జెట్ పుస్తకాలు, విభాగాల వారీగా ఇచ్చిన పద్దుల చిట్టాల్లో నిరుటి బడ్జెట్ అంచనాలను.. యథాతథంగా సవరించిన అంచనాలుగా పునర్ ముద్రించడం గమనార్హం.
     
    ఆర్థిక లోటుకు రాష్ట్ర ఆదాయ వ్యయాలేవీ కారణం  కాదని.. కేంద్రాన్ని వేలెత్తి చూపేందుకు ప్రభుత్వం ఎక్కువ మొగ్గు చూపించింది. ‘‘కేంద్రం నుంచి రావాల్సిన ప్రణాళిక, ప్రణాళికేతర నిధుల్లో తరుగు, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్‌లో పరిహారం, ప్రత్యేక ఆర్థిక సాయం రాకపోవడం.. రుణ పరిమితి పెంపును సడలించకపోవడం... ఇవన్నీ కలిపితే రాష్ట్ర ఆదాయ వనరుల్లో రూ.20,277 కోట్ల లోటు ఏర్పడింది..’ అని ఈటెల వెల్లడించారు. ‘కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు బాగా తగ్గాయి. అంచనాల ప్రకారం వచ్చి ఉంటే.. రాష్ట్ర ఆదాయ వ్యయాలను మరింత సమర్థవంతంగా నిర్వహించగలిగే వాళ్లం. రాష్ట్ర బడ్జెట్‌లో గత ఏడాది కేంద్రం నుంచి రావల్సిన ప్రణాళికా సాయం రూ.11,781 కోట్లకు గాను 2015 ఫిబ్రవరి వరకు రూ.4,147 కోట్లు మాత్రమే వచ్చాయి. ప్రణాళికేతర గ్రాంట్లు రూ. 9,939 కోట్లు కాగా, రూ.1,346 కోట్లు మాత్రమే అందాయి.

    ప్రతిపాదించిన మొత్తంలో కేవలం 14 శాతం నిధులు. ఎఫ్‌ఆర్‌బీఎం (ఫిస్కల్ రెస్పాన్సిబులిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్) చట్టం కింద కొంతమేర అప్పు తెచ్చుకునే అవకాశం రాష్ట్రాలకు ఉంటుంది. ఈ పరిమితిని సడలించి మరో రూ. 4 వేల కోట్ల అప్పు తెచ్చుకునేందుకు రాష్ట్రానికి అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. కేంద్రం నుంచి ఇంతవరకు ఏ సమాధానమూ రాలేదు. దీనికి తోడు కేంద్ర ప్రణాళికా నిధుల కేటాయింపుపై చాలా ఆలస్యంగా.. ఫిబ్రవరిలో సమాచారం అందించింది..’ అంటూ ఆదాయ వనరుల్లో లోటుకు కారణాలను ఆర్థిక మంత్రి ఈటెల ప్రసంగంలో ప్రస్తావించారు.
     
    ద్రవ్యలోటుపై కేంద్రంతో పేచీ

    అప్పులకు రాష్ర్టం తిప్పలు పడుతోంది. అనుకున్నన్ని అప్పులు తీసుకునేందుకు కేంద్రం విధించిన నిబంధనలు తెలంగాణకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అందుకే ద్రవ్యలోటు (అప్పులు తెచ్చుకునే పరిమితి) విషయంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని నిందించింది.  ‘కేంద్ర ప్రభుత్వం 2015-16 బడ్జెట్ ప్రతిపాదనల్లో జీడీపీలో 3.9 శాతం ద్రవ్యలోటుగా చూపించింది. కానీ రాష్ట్రాలకు జీఎస్‌డీపీలో 3 శాతానికి ద్రవ్యలోటును పరిమితం చేయడం విచిత్రమైన విషయం. 14వ ఆర్థిక సంఘం కొన్ని నిబంధనలకు లోబడి రాష్ట్రాల అప్పుల పరిమితిని 3.5 శాతానికి పెంచింది.

    ఈ సిఫారసుపై నేటికీ కేంద్రం  నిర్ణయం తీసుకోలేదు..’ అని తప్పు బట్టింది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం.. జీఎస్‌డీపీలో 3 శాతానికి మించి రాష్ట్రాలు అప్పుగా తెచ్చుకునే అవకాశం లేదు. అంతకంటే ఎక్కువ అప్పులు కావాలంటే కేంద్రం అనుమతించాల్సి ఉంటుంది. గత ఏడాది బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు 4.79 శాతం.. 17,398.72 కోట్లుగా అంచనా వేసుకుంది.

    ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచాలని కోరితే కేంద్రం నుంచి స్పందన లేదు. దీంతో రూ.10 వేల కోట్ల రుణాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పటికీ గుణపాఠం నేర్వని ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లోనూ ద్రవ్యలోటును ఎక్కువగానే చూపించింది. 2015-16 బడ్జెట్‌లో ద్రవ్యలోటు 3.49 శాతం రూ.16,969 కోట్లు అంచనా వేసుకుంది. కేంద్రం అనుమతించకపోతే ఈసారి కూడా మూడు శాతానికి మించి అప్పులు తెచ్చుకోవటం కుదరని పరిస్థితి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement