గచ్చిబౌలి (హైదరాబాద్): నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఐటీ కారిడార్‌లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఐటీ కారిడార్‌లో పోలీసులు వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేస్తున్నారు. అందుకోసం మాదాపూర్‌లోని మైండ్ స్పేస్ జంక్షన్, నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని విప్రో జంక్షన్‌లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద సాయుధ పోలీసులు రాత్రి, పగలు తనిఖీలు నిర్వహిస్తారని ఐటీ కారిడార్ ఇన్‌స్పెక్టర్ జె.రమేశ్ కుమార్ బుధవారం తెలిపారు.
అంతే కాకుండా ఇనార్బిట్ మాల్, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద నిరంతరాయంగా వాహనాల తనిఖీలు కొనసాగుతాయన్నారు. ఐటీ కారిడార్‌లో ఇంటర్ సెక్టార్ మొబైల్ గస్తీ నిర్వహిస్తుంటుంది. ఇటీవల నల్లగొండ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని ఇన్‌స్పెక్టర్లు, సెక్టార్ ఎస్సైలు అప్రమత్తమయ్యారు.