అది పేరుకే భవనం..నిజానికది ఓ అద్భుత కళాఖండం..నిజాం జమానాకు నిజమైన ప్రతీక...నిర్మాణ కౌశలానికి నిండైన రూపం.విశిష్ట శిల్పకళారీతులకు విశేష దర్పణం.. రాచఠీవికి ప్రతిబింబం.వాస్తురీతులకు వాస్తవరూపం.చూపరులకు కనువిందు. మూసీ ఒడ్డున ముచ్చటైన నిర్మాణం. వందేళ్లు పూర్తి అయినా చెక్కుచెదరని వైభవం దాని సొంతం. వన్నె తగ్గకుండా కాంతులీనుతున్న ఆ కళాఖండమే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు భవనం. అది వందేళ్ల చరిత్రకు ప్రత్యక్ష సాక్షి. నేడు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ భవనంపై ప్రత్యేక కథనం...
– సాక్షి, హైదరాబాద్
మూసీ ఒడ్డున సుందర భవనం.. హైదరాబాద్ నగరంలో మూసీనది ఒడ్డున అత్యంత సుందరంగా నిర్మించిన హైకోర్టు భవనం శతాబ్ది వేడుకలకు ముస్తాబవుతోంది. హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1920 ఏప్రిల్ 20న హైకోర్టు భవనాన్ని ప్రారంభించారు. 1915 ఏప్రిల్ 15న ప్రారంభమైన ఈ భవననిర్మాణం 1919 మార్చి 31 నాటికి పూర్తయినా 1920 ఏప్రిల్ 20న అధికారికంగా ప్రారంభించారు.
చరిత్రలోకి ఓసారి...
నిజాం హయాంలో హైదరాబాద్ రాజ్యంపై బ్రిటిష్ ప్రభావం ఎక్కువగా ఉండేది. 1800 అక్టోబరులో ఈస్టిండియా కంపెనీతో నిజాం రాజు ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పట్లో నిజాం కోర్టు నిర్వహణ బ్రిటిష్ వారి ఆధ్వర్యంలోనే సాగేది. సాలార్ జంగ్ హైదరాబాద్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సరికొత్త న్యాయ వ్యవస్థను రూపొందించారు. హైకోర్టు మొదట పత్తర్‌ఘట్టిలో ఉండేది. 1909లో వరదలు రావడంతో లాల్‌బాగ్‌లోని నవాబ్ సర్ ఆస్మాన్ ఝా దేవిడిలోకి మారింది. 1912లో కలరా వ్యాధి వ్యాపించడంతో దేవిడి నుంచి పబ్లిక్ గార్డెన్‌లోకి, 4 నెలల తరువాత చత్తాబజార్ లక్కడ్‌కోట్‌లోని సాలార్ జంగ్ బహదూర్ నివాసంలోకి తరలించారు. అక్కడా అనువుగా లేకపోవడంతో 1914లో సైఫాబాద్‌లో నవాబ్ సత్రజ్ జంగ్ నుంచి భవనాన్ని అద్దెకు తీసుకుని అక్కడికి మార్చారు. ఈ దశలోనే సర్వోన్నత న్యాయస్థానానికి శాశ్వత భవనం నిర్మించాలన్న ఆలోచన మొగ్గ తొడిగింది.
తీరైన నిర్మాణ కౌశలం ఈ భవనం సొంతం.
జైపూర్‌కు చెందిన ఇంజనీరు, ఆర్కిటెక్ట్ శంకర్‌లాల్ హైకోర్టు భవన నమూనాను రూపొందించారు. స్థానిక ఇంజనీరు మెహర్ అలీ ఫజల్ నిర్మాణపనుల పర్యవేక్షణ చేపట్టారు. బ్రిటిష్ ఇంజనీరు విన్సెంట్ జె.ఎక్ ప్రపంచమంతా పర్యటించి ఎక్కడా లేని విధంగా భవనం నిర్మాణ ఆకృతి రూపొందించారు. సుమారు రూ.18,22,750 వ్యయ అంచనాతో నవరతన్ దాస్ కాంట్రాక్ట్ పొందారు. నిజాం నవాబు ఇచ్చిన 300 కిలోల వెండితో హైకోర్టు నమూనాను రూపొందించి భవనానికి తాపడం చేశారు. గులాబీ రంగు గ్రానైట్, రాతితో అద్భుత కళాఖండంగా ఈ భవనాన్ని నిర్మించారు. ఇండోఇస్లామిక్ సంప్రదా య రీతిలో డోమ్‌ల ఆకృతిని ప్రత్యేక ఆకర్షణగా రూపొందించారు. భవన నిర్మాణం, రాతి శిల్పాలన్నీ నిజాం కాలంనాటి కళానైపుణ్యానికి అద్దంపట్టేలా ఉన్నాయి. మొదట ఆరుగురు జడ్జీల కార్యకలాపాలు, బార్ అసోసియేషన్‌కు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టారు. 1958 జులై 10న అదనంగా మరో రెండు బ్లాక్‌లను నిర్మించారు. 1976లో మరో బ్లాక్, 1998లో బహుళ అంతస్తుల పరిపాలనాభవనాలను నిర్మించారు. హైకోర్టు భవనం పక్కనే నిజాం కాలం నుంచి సేవలందిస్తున్న జజ్జిఖానా (ప్రసూతి ఆస్పత్రి)ను మరో ప్రాంతానికి తరలించి ఆస్పత్రికి చెందిన 9.5 ఎకరాలను 2009లో హైకోర్టుకు అప్పగించారు. అక్కడ కూడా ప్రత్యేక బ్లాకు నిర్మించారు.
ఒకే భవనం.. వివిధ పేర్లు..
నిజాం కాలంలో రాయల్ చార్టర్ కింద కొనసాగిన న్యాయస్థానంలో 1928 హైకోర్టు యాక్ట్ కింద బెంచ్‌లను ఏర్పాటు చేసి కేసుల విచారణ మొదలుపెట్టారు. అప్పీళ్లపై విచారణకు జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటైంది. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైన తరువాత హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్ పేరిట కొనసాగింది. 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగింది. ఇదే భవనంలో దీపావళి, రంజాన్ పండుగల సందర్భంగా 1956 నవంబరు 5న 11 మంది జడ్జీలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రారంభమైంది. మొదటి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కోకా సుబ్బారావు, మొదటి అడ్వొకేట్ జనరల్‌గా దువ్వూరి నరసరాజు పనిచేశారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. దీంతో అదే తేదీ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా కొనసాగింది. రాష్ట్రపతి ఉత్తర్వులతో 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఏర్పాటైంది. ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కావడంతో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఈ భవనంలోనే కొనసాగుతోంది. న్యాయస్థానాల పేర్లు మారుతూ వస్తున్నా వందేళ్లుగా ఈ భవనం సేవలందిస్తూ వస్తోంది.
భవనంలో అగ్నిప్రమాదం
2009 ఆగస్టు 31న రాత్రి హైకోర్టు ప్రధాన భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లైబ్రరీ హాలు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఇందులో ఇంగ్లిష్ లా రిపోర్ట్స్, జర్నల్స్ అన్నీ కాలి బూడిదయ్యాయి. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు పోరాటంతో మద్రాసు హైకోర్టు నుంచి తీసుకువచ్చిన పుస్తకాలన్నీ ఆగ్నికి ఆహుతయ్యాయి. చిత్రాలు, నిజాం కాలం నాటి ఫర్నిచర్ కాలిపోయాయి. అనంతరం అదే రూపంలో భవనాన్ని పునరుద్ధరించి 2011 అక్టోబరు 13న ప్రారంభించారు.
ఘనంగా శతాబ్ది ఉత్సవాల నిర్వహణ..
హైకోర్టు భవనానికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను నిర్వ హించాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్‌తో కలసి న్యాయ మూర్తులందరూ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. శనివారం సాయంత్రం జరిగే ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ లావు నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
తీరైన ఆర్కిటెక్చర్‌కు నిదర్శనం
చారిత్రక సంపదకు, నిజాం కాలంనాటి అద్భుత నిర్మాణ కౌశలానికి ఈ భవనం అద్దం పడుతోంది. గతంలో ఓ సారి అగ్నిప్రమాదం సంభవించి కొంత మేర నష్టం వాటిల్లినప్పటికీ భవనం చెక్కు చెదరలేదు. హైకోర్టు భవనంతోపాటు నగరంలోని అన్ని చారిత్రక కట్టడాలను ప్రభుత్వం పరిరక్షించాలి. హైకోర్టు భవనం వందేళ్ల పండగ జరుపుకోవడం ఆనందం కలిగిస్తోంది.
– అనురాధారెడ్డి, ఇన్‌టాక్ సంస్థ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment