
సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి నియామకంపై హైకోర్టు మంగళవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అలాగే గుత్తా సుఖేందర్‌రెడ్డికి సైతం నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన సుఖేందర్‌రెడ్డికి రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవిని ఇవ్వడం చట్ట విరుద్ధమని, అందువల్ల ఆయన నియామక జీవోను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిస్తూ రద్దు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ, పార్లమెంట్ సభ్యునిగా ఉన్న వ్యక్తి లాభదాయక పోస్టులో కొనసాగరాదన్నారు.
రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవి లాభదాయక పోస్టు కిందకు వస్తుందని, అందువల్ల ఆయనను పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించాలని ఆమె కోర్టును కోరారు. రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా గుత్తా గౌరవ వేతనం పొందుతున్నారని, ఎంపీగా ఉన్న వ్యక్తి ఇలా గౌరవవేతనం తీసుకోవడం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం లాభదాయక పోస్టు కిందకు వస్తుందని ఆమె వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు నోటీసులు జారీ చేసింది.