నరేశ్ అదృశ్యంపై దర్యాప్తు బాధ్యత ఎస్పీకి..
డీజీపీకి హైకోర్టు ఆదేశం.. జూన్ 1న హాజరుపరచాలని సూచన
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అంబోజి నరేశ్ అదృశ్యం.. అతడిని కులాంతర వివాహం చేసుకున్న స్వాతి ఆత్మహత్య వ్యవహారంపై విచారణ జరిపే బాధ్యతలను జిల్లా ఎస్పీకి అప్పగించాలని ఉమ్మడి హైకోర్టు గురువారం డీజీపీని ఆదేశించింది. నరేశ్ అచూకీ తెలుసుకుని అతడిని జూన్ 1న కోర్టు ముందు ప్రవేశపెట్టాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఆచూకీ తెలుసుకోలేకపోతే అందుకు సంబం« దించి పూర్తి వివరాలతో ఓ నివేదికను తమ ముందుంచాలని ఎస్పీకి సూచించింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. స్వాతిని కులాంతర వివాహం చేసుకున్న తరువాత తన కుమారుడు నరేశ్ ఆచూకీ లభించడం లేదని, ఈ పెళ్లి ఇష్టం లేని స్వాతి తండ్రిపైనే తమకు అనుమానం ఉందని, తన కుమారుడిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీ సులను ఆదేశించాలంటూ అంబోజి వెంకటయ్య వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది.
స్థానిక పోలీసులపై నమ్మకం లేదు: పిటిషనర్
ఈ సందర్భంగా పోలీసుల తరుఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్.శరత్‌కుమార్ వాదిస్తూ నరేశ్ ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా ప్రయత్నిం చినా అచూకీ లభించలేదన్నారు. ఈ నెల 16న స్వాతి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఆరోపణలకు తావు లేకుండా ఆమె మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టంను వీడియో తీసి భద్రపరిచామని చెప్పారు.
వేసవి సెలవుల తరువాత నరేశ్ అచూకీపై పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని, అప్పటి వరకు గడువు ఇవ్వాలని కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది అర్జున్ స్పందిస్తూ స్థానిక పోలీసులపై నమ్మ కం లేదని, స్వాతి ఆత్మహత్యపై తమకు అనుమానాలున్నాయని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ గతంలో స్వాతి ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నిం చిందని, అలాంటప్పుడు ఆమెను తల్లిదండ్రులు ఒంటరిగా ఎలా వదిలేస్తారని ప్రశ్నించింది. తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేసింది.