ఓసీలు బీసీలుగా.. బీసీలు ఎస్సీలుగా.. | High Court Stays Polls In Four Municipalities | Sakshi
Sakshi News home page

ఓసీలు బీసీలుగా.. బీసీలు ఎస్సీలుగా..

Published Thu, Jul 18 2019 6:46 AM | Last Updated on Thu, Jul 18 2019 6:47 AM

High Court Stays Polls In Four Municipalities - Sakshi

  • ఇబ్రహీంపట్నం పురపాలికలో 8–120 ఇంట్లో ఇద్దరు కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటుండగా.. 144 ఓటర్లు ఉన్నట్లు నమోదు చేశారు. 8–119 ఇంటిలో నివసిస్తున్న నలుగురిలో ఒకరికే ఓటు ఉండగా.. ఈ ఇంటి పేరు మీద ఏకంగా 60 ఓట్లను ఎక్కించారు. 6–72లో 102 ఓట్లు, 6–28లో 105 ఓట్లు ఎక్కించారు.
  • హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీలో 6వ వార్డులో ఉండాల్సిన ఓట్లు 7వ వార్డులో, 9వ వార్డులో ఓట్లు 10వ వార్డులో చేర్చారన్న ఆరోపణలున్నాయి. 6, 7, 9, 10, 11 వార్డుల ఓటర్ల జాబితాల తయారీలో అవకతవకలు జరిగాయన్నది స్థానికుల వాదన. ఇది వార్డులు రిజర్వేషన్ల ఖరారుపై కూడా ప్రభావం చూపనుంది. ఇప్పటికే ఓటరు జాబితా అవకతవకలపై 26 దరఖాస్తులు అందగా, వందల సంఖ్యలో ఓటర్లు తమ ఓట్లు ఎక్కడున్నాయో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. పట్టణానికి చెందిన కొందరు హైకోర్టును ఆశ్రయించారు.

సాక్షి, హైదరాబాద్‌ : ఈ రెండు పురపాలికల్లోనే కాదు రాష్ట్రంలోని మిగతా చోట్ల కూడా ఓటర్ల జాబితాలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఇల్లు కట్టని ప్లాట్లలో కుటుంబాలకు కుటుంబాలే జీవిస్తున్నట్లు ఓ గందరగోళ జాబితా తయారీలో అధికారులు, రాజకీయ నాయకులు శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఓపెన్‌ ప్లాటే కాదు.. ఆఖరికి సర్వే నంబర్లలోనూ ఓటర్లున్నట్లు నమోదు చేశారు. పెద్ద అంబర్‌పేట పురపాలక సంఘం పరిధిలోని 7వ నంబర్‌ వార్డులో మొత్తం 1,615 మంది ఓటర్లలో ఏకంగా 588 మంది ఒకే సర్వే నంబర్, ఓపెన్‌ ప్లాట్‌లో నివాసమున్నట్లు జాబితాలో పొందుపరిచారు. అదే మున్సిపాలిటీలోని 15 వార్డులో ఒక కంపెనీలో పనిచేస్తున్న 211 మంది స్థానికేతరులను కూడా సర్వే నంబర్‌ ఆధారంగానే జాబితాలోకి ఎక్కించారు. ఆఖరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపులోనూ ఇలాంటి సిత్రాలెన్నో జరిగాయి. ఇంటింటికి తిరగకుండానే కార్యాలయాల్లో కూర్చొని ఓటర్ల జాబితా కూర్పు చేయడంతో ఓసీలు బీసీలుగా.. బీసీలు కాస్తా ఎస్సీలుగా నమోదయ్యారు. 

హడావుడితో ఆగమాగం! 
సాధ్యమైనంత త్వరగా మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో వార్డుల విభజన, ఓటర్ల జాబితా అస్తవ్యస్తంగా రూపొందించారు. వార్డుల విభజనలో తప్పులు దొర్లడం.. కుటుంబ సభ్యుల ఓట్లు వేర్వేరు వార్డుల్లో నమోదు కావడమే కాకుండా.. ఆఖరికి భార్యాభర్తల ఓట్లను కూడా విడగొట్టడంతో పురపాలక శాఖ పనితీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు ఓటర్ల జాబితా షెడ్యూల్‌ను తరచూ కుదింపు.. పొడిగింపు చేస్తుండటం కూడా విమర్శలకు తావిస్తోంది. వార్డుల ఖరారులో శాస్త్రీయత పాటించకపోవడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా తయారీలో చోటుచేసుకున్న అక్రమాలపై హైకోర్టు కూడా సీరియస్‌ అయింది. ఇప్పటికే శంషాబాద్, భైంసా, ఇబ్రహీంపట్నం, మీర్‌పేట, బండ్లగూడ జాగీర్, మహబూబ్‌నగర్, మిర్యాలగూడ మున్సిపాలిటీల ఎన్నికలపై స్టే విధించింది. ఈ కోవలోనే మరికొందరు కోర్టు మెట్లెక్కేందుకు రెడీ అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 129 మున్సిపాలిటీలు, మూడు నగర పాలక సంస్థలకు ఆగస్టు రెండో వారంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

రాజకీయ ఒత్తిళ్లు.. 
వార్డుల విభజన, ఓటర్ల జాబితా తయారీపై రాజకీయ ఒత్తిళ్లు పనిచేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓటర్ల జాబితాలో ఏకంగా ఓపెన్‌ ప్లాట్, సర్వే నంబర్లలో స్థానికేతరుల పేర్లను నమోదు చేస్తున్నారంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. ఎన్నికల తంతును త్వరితగతిన పూర్తి చేయాలనే ప్రభుత్వ నిర్ణయం మున్సిపల్‌ యంత్రాంగంపై ప్రభావం చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే ఓటర్ల జాబితాలో నమోదవుతున్న పేర్లను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా యథాతథంగా అచ్చేస్తుండటం ఈ ఆరోపణలకు అద్దంపడుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement