
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం నుంచి మూడు రోజులు వడగాడ్పులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఇదిలావుండగా ఆదివారం భద్రాచలం, ఖమ్మంల్లో 45 డిగ్రీల చొప్పున అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ, రామగుండంల్లో 44 డిగ్రీలు, హన్మకొండ, నిజామాబాద్‌ల్లో 43 డిగ్రీలు, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌ల్లో 42 డిగ్రీలు, హైదరాబాద్‌లో 41 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఈశాన్య ఛత్తీస్‌గఢ్ నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు తెలంగాణ, రాయలసీమ, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వెల్లడించారు.
ఏపీలో 19మంది మృత్యువాత
రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఏపీ విలవిల్లాడిపోతోంది. ఓవైపు ఎండవేడి మరోవైపు ఉక్కపోత జనాలకు ఊపిరాడనీయకుండా చేస్తోంది. నానాటికీ వడగాడ్పుల తీవ్రత పెరుగుతోంది. దీంతో వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు అల్లాడిపోతున్నారు. శని, ఆదివారాల్లోనే రాష్ట్రంలో పందొమ్మిదిమంది మృత్యువాత పడ్డారు.