
సూర్యాపేట నుంచి సిరిసిల్ల వరకు హైవే
నల్లగొండ జిల్లా సూర్యాపేట నుంచి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల వరకు ఉన్న రోడ్డు త్వరలో జాతీయ రహదారిగా మార్పు చెందనుందని...
* కేంద్రానికి ముఖ్యమంత్రి ప్రతిపాదనలు
* భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడి
సిద్దిపేట జోన్: నల్లగొండ జిల్లా సూర్యాపేట నుంచి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల వరకు ఉన్న రోడ్డు త్వరలో జాతీయ రహదారిగా మార్పు చెందనుందని భారీ నీటిపారుదల శాఖ మం త్రి హరీశ్‌రావు తెలిపారు. గురువారం మెదక్ జిల్లా సిద్దిపేట మునిసిపల్ శివారులోని ఇమాం బాద్ సరిహద్దులో రూ.2.45 కోట్లతో వంతెన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
ఆయన మాట్లాడుతూ సూర్యాపేట, జనగామ, సిద్దిపేట మీదుగా సిరిసిల్ల నుంచి కామారెడ్డి జాతీయ రహదారిని కలుపుతూ రాష్ర్ట ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు అందజేసిందన్నారు. ఆ దిశగా సీఎం కేసీఆర్ డీపీఆర్ రూపకల్పనకు రోడ్లు, భవనాల శాఖకు ఆదేశాలు జారీ చేశారన్నారు. విజయవాడ, కామారెడ్డి జాతీ య రహదారులకు అనుసంధానం చేస్తే భవిష్యత్తులో సిద్దిపేట, సిరిసిల్ల ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయని మంత్రి పేర్కొన్నారు.
రోడ్డు విస్తరణలో భాగంగా భూసేకరణ ప్రక్రియను నిర్వహించి బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత నష్టపరిహారాన్నిస్తుందన్నారు. మూల మలుపులను తగ్గించి రోడ్డును నేరుగా నిర్మించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సిద్దిపేట నియోజకవర్గంలోని సిరిసిల్ల మార్గంలో రూ.6.5 కోట్లతో బ్రిడ్జీల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు.