హిందూ జాతి మనుగడకు నలుగుర్ని కనాలి
⇒ తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ వ్యాఖ్య
హైదరాబాద్: దేశంలో హిందూ జాతి మిగలాలంటే ఇంటికి నలుగురు పిల్లలను కనాలని, లేకపోతే జాతి మనుగడ సాగించదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ అన్నారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే స్మారక పోటీల విజేతల బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ సభలో స్వామిగౌడ్ మాట్లాడుతూ.. ఏ ఇజాలు లేని రోజుల్లోనే నిజాలు మాట్లాడిన మహాత్ముడు జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు.
శెట్టిబలిజ, గౌడ, కలాయి, కౌండిన్య తదితర గౌడ్ కులస్తులందరికీ ఒకే తీరు రిజర్వేషన్లు అమలుపై బీసీ కమిషన్‌కు పూర్తి వివరాలు అందజేశానని పేర్కొన్నారు. బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు డాక్టర్. కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. బహుజనులు తెచ్చుకున్న తెలంగాణలో వారిని విస్మరిస్తే మరో పోరాటం ప్రారంభమవుతుందన్నారు.
ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి ఎ. రామలింగేశ్వరరావు మాట్లాడుతూ దేశ చరిత్రను పాక్షికంగానే రాశారని అందులో మహాత్ముల చరిత్రలు ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల అనగానిని ఘనంగా సన్మానించారు. వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు.