ఆసుపత్రులకు సుస్తీ
- {పజారోగ్యానికి సూది ‘పోటు’
- కోమాలో ప్రభుత్వ ఆసుపత్రులు
- పెద్దాసుపత్రుల్లో కనీస వైద్యం కరువు
- సిబ్బంది కొరత.. పారిశుధ్య లేమి
- పనిచేయని పరికరాలు
- మృత్యువాత పడుతున్న రోగులు
సాక్షి, సిటీబ్యూరో: ఆరోగ్య రాజధానిగా పేరొందిన హైదరాబాద్‌లో అనారోగ్యం రాజ్యమేలుతోంది. ప్రజా ఆరోగ్యం ప్రమాదంలో పడింది. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కనీస సదుపాయాలకు నోచుకోవడం లేదు. వైద్యులు, వైద్య పరికరాలు, మందులు, మౌలిక వసతుల్లేక పుట్టెడు రోగాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకప్పుడు ప్రాణం పోసిన సర్కారు దవాఖానాలే ఇప్పుడు రోగుల ఉసురు తీస్తున్నాయి. పేద ప్రజలకు పెద్దదిక్కుగా ఉన్న ఉస్మానియా, గాంధీ బోధనాసుపత్రులతోపాటు, నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రి, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రుల్లో సైతం నిత్యం మరణ మృద ంగం వినిపిస్తోంది.
ఊపిరి తీస్తున్న ఉస్మానియా...
ఉస్మానియా ఆస్పత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. నిబంధనల ప్రకారం 186 రకాల మందులు సరఫరా చేయాల్సి ఉండగా.. 60 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. మిగిలిన మందులు రోగులే సమకూర్చుకోవాల్సి వస్తోంది. క్యాన్స ర్, కిడ్నీ, గుండె, కాలేయ సంబంధిత జబ్బులతో బాధపడుతున్న రోగుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. బై అండ్ సప్లయ్ కింద అవసరాన్ని బట్టి కొన్ని మందులు కొనుగోలు చేస్తున్నా.. అవి రోగుల అవసరాలు తీర్చలేక పోతున్నాయి. ఆస్పత్రిలో ప్రధాన సమస్య పారిశుధ్య లోపం. వైద్యం కోసం వెళ్లిన వారికి ఆస్పత్రిలోని ఇన్‌ఫెక్షన్ సోకి కొత్త రోగాలు వస్తున్నాయి. ఆస్పత్రిలో ఏ మూల చూసిన చెత్తకుప్పలే దర్శనమిస్తాయి. వార్డుల్లో మురుగు నీరు నిల్వ ఉంటుంది. ఏ విభాగంలోకి తొంగి చూసినా చెడు వాసనే. గతంలో 800కి పైగా వీల్‌చైర్లు, స్ట్రెచర్లు ఉండగా.. ప్రస్తుతం 200కి మించి లేవు. సెలైన్ స్టాండ్స్ లేక పోవడంతో రోగి బంధువుల బాటిళ్లను చేతిలో పట్టుకుని నిలబడాల్సి వస్తోంది. ఆర్థోపెడిక్ విభాగంలో పడకల కొరత తీవ్రంగా ఉంది.
పడకేసిన పట్టణ ఆరోగ్య కేంద్రాలు
నగరంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలకు సుస్తీ చేసింది. చికిత్స చేయాల్సిన ప్రభుత్వం మచ్చుకైనా పట్టించుకోవడం లేదు. వైద్యులపై అజమాయిషీ లేక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 9 గంటలకే ఆస్పత్రికి చేరుకోవాల్సిన ప్రభుత్వ వైద్యులు 11 గంటలు దాటినా పత్తా ఉండటం లేదు. జ్వరం, దగ్గు, కడుపునొప్పికి సంబంధించిన సిరఫ్‌లు దొరకడం లేదు. అంబర్‌పేట్, శ్రీరాంనగర్, జంగ మ్మెట్, లాలాపేట్, పానిపుర, పాన్‌బజార్, పురానాపూల్, బోరబండ పట్టణ ఆరోగ్య కే ంద్రాలను సర్వీసు ఆస్పత్రులుగా తీర్చిదిద్దారు. పురిటి నొప్పులతో బాధపడుతూ అర్ధరాత్రి ఆస్పత్రికి వెళ్తే... తీరా అక్కడ ఒకరిద్దరు న ర్సింగ్ సిబ్బంది మినహా వైద్యులు అసలే ఉండటం లేదు. ఏరియా ఆస్పత్రుల్లో కుక్క కాటుకు యాంటీ రేబిస్ మందు దొరకడం లేదు. ఇక పాము కరిస్తే అంతే.. ఉస్మానియాకు పరుగులు తీయాల్సిందే. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో పిల్లల వైద్యనిపుణులు లేక ఇప్పటికే అనేకమంది మృత్యువాత పడ్డారు. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో గర్భిణులు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. మలక్‌పేట్, కింగ్‌కోఠి, గోల్కోండ ఏరియా ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. పాతబస్తీలో వ్యాక్సినేషన్ సరిగా జరగకపోవడంతో అనేక మంది డిఫ్తీరియా, మీజిల్స్, మమ్స్ బారిన పడుతున్నారు. 2013లో 1120 మంది డిఫ్తీరియా, 563 మంది మీజిల్స్, 479 మంది మమ్స్ బారిన పడ్డారు. ఆ సంఖ్య ఈ ఏడాది పెరగనుంది. 2014 ఫిబ్రవరి చివరి నాటికే 161 మంది డిప్తీరియా, 209 మంది మీజిల్స్, 104 మంది మమ్స్ బారిన పడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
హే గాంధీ..!
‘గాంధీ’లోనూ సిబ్బంది కొరత ఉంది. ఆస్పత్రిలో వెంటిలేటర్లు 50 ఉండగా, వీటిలో 60 శాతం పరికరాలు పని చేయడం లేదు. సీటీ, ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే యంత్రాలు తరచూ మెరాయిస్తున్నాయి. డయాలసిస్ విభాగంలో ఉన్న ఐదు యంత్రాలకే రెండే పనిచేస్తున్నాయి. పారిశుధ్యం ఇంకా మెరుగు పడాల్సి ఉంది. ఆస్పత్రిలో 18 లిఫ్ట్‌లు ఉండగా.. ఐదే పని చేస్తున్నాయి. కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ విభాగాల్లో పడకల కొరత తీవ్రంగా ఉంది. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేక ఒక్కో మంచంపై ఇద్దరు రోగులను ఉంచాల్సి వస్తోంది. మందుల కొరత వల్ల హీమోఫీలియా బాధితులు మృత్యువాత పడుతున్నారు. మార్చురీలో ఆరు ఫీజర్ బాక్కులు ఉండగా.. వీటిలో మూడు పని చేయడం లేదు.
రోజుకు 12 మంది పిల్లల మృతి
700 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రిలో నిత్యం 1200 మంది శిశువులు చికిత్స పొందుతుంటారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు, వెంటిలేటర్లు, ఫొటో థెరపీ యూనిట్లు, వార్మర్లు లేకపోవడంతో ఒక్కో యంత్రంపై నలుగురు చిన్నారులను పడుకోబెడుతున్నారు. ఇక్కడ కేవలం వందమంది నర్సులే ఉన్నారు. శిశువులను చూసుకునేందుకు ఆయాలు, నర్సులు లేక రోగుల బంధువులే ఆ బాధ్యతలను చూసుకోవాల్సి వస్తోంది. చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోకుండా రోజుల తరబడి ఎన్‌ఐసీయూలో ఉండటం, అక్క డే భోజనం చేయడం వల్ల శిశువులకు ఇన్‌ఫెక్షన్ సోకుతోంది. దీంతోపాటు సకాలంలో వైద్యం అందక రోజూ సగటున 12 మంది శిశువులు మృత్యువాత పడుతున్నారు. ఆస్పత్రిలో కాన్పు సమయంలో అధిక రక్తస్రావ సమస్యలు తలెత్తుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వీరికి అవసరమైన రక్తం దొరకడం లేదు. క్రిటికల్‌కేర్ యూనిట్ కూడా లేక అధిక రక్తస్రావం వల్ల అపస్మారక స్థితిలోకి చేరుకున్న బాలింతలను చివరకు ఉస్మానియా, గాంధీ బోధనాసుపత్రులకు తరలిస్తుండటంతో అప్పటికే పరిస్థితి విషమిస్తోంది. పనిచేయని వార్మర్లు, ఫొటో థెరపీ యూనిట్లలో శిశువులను ఉంచుతుండటంతో వారు చనిపోతున్నారు. ఎమర్జెన్సీ విభాగంలో గత మూడేళ్ల నుంచి లిఫ్ట్ పనిచేయడం లేదు. కార్డియాలజీ విభాగం ఉన్నా.. ఈసీజీ, టూడీ ఎకో పరీక్షల కోసం ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
పేట్ల బురుజు... నిర్లక్ష్యపు బూజు
సుమారు 642 పడకల సామర్థ్యం ఉన్న పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో రోజుకు సగటున 50 ప్రసవాలు జరుగుతుంటాయి. కాన్పు సమయంలో చాలామంది బాలింతలు అధిక రక్తస్రావంతో బాధ పడుతుంటారు. వీరికి చికిత్స అందించేందుకు ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ లేక ఉస్మానియాకు తరలించాల్సి వస్తోంది. ఇంతపెద్ద ఆస్పత్రిలో కేవలం 50 మంది వైద్యులే ఉన్నారు. రోగుల నిష్పత్తికి తగినంత మంది ఆయాలు, స్టాఫ్ నర్సులు లేరు. పడకల కొరత వల్ల ఒక్కో మంచంపై ఇద్దరు ముగ్గురు బాలింతలను ఉంచుతున్నారు. పారిశుద్ధ్య లోపం రోగుల పాలిట శాపంగా మారింది. ఆస్పత్రికి వచ్చిన నిరుపేద గర్భిణులను ఆల్ట్రాసౌండ్ పరీక్షల కోసం బయటికి పంపుతున్నారు. ఇందుకోసం రూ. వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఓపీ చీటీల కోసం ఉదయం 4 గంటల నుంచే క్యూలో నిలబడాల్సిన దుస్థితి. అదే విధంగా 150 పడకల సామర్థ్యం ఉన్న సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోనూ గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు.
బడ్జెట్ పెంచాలి
ప్రభుత్వ ఆస్పత్రులకు బడ్జెట్ కేటాయింపులు దారుణంగా ఉంటున్నాయి. వైద్యసేవలు మెరుగుపడాలంటే ఆస్పత్రి వార్షిక బడ్జెట్‌ను మరింత పెంచాలి. రోగుల నిష్పత్తికి తగినంతమంది పారామెడికల్ స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్లతో పాటు శానిటేషన్ సిబ్బందిని నియమించాలి. రోగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన అన్నిరకాల వైద్య పరికరాలను సమకూర్చాలి. కేవలం ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకే కాకుండా ఆస్పత్రికి వచ్చిన రోగులందరికీ నాణ్యమైన మందులను అందించాలి. రోగులకు అవసరమైన మందులు, వైద్య పరికరాలు కొనుగోలు చేసే అధికారం ఆయా ఆస్పత్రుల సూపరింటిండెంట్లకు ఇవ్వాలి.
- డాక్టర్ నాగేందర్, ఉస్మానియా మెడికల్ కళాశాల
కు.ని. చేసి నేలపై పడుకోబెడతారు
డీపీఎల్ క్యాంప్‌లో భాగంగా ఆపరేషన్ చేయించుకున్న మహిళలను నేలపై పడుకోబెడుతున్నారు. ప్రభుత్వానికి కనీస మానవత్వం లేదు. ఆస్పత్రిలో మందులే కాదు మంచి నీళ్లు కూడా దొరకడం లేదు.
- కాంతమ్మ, షాపూర్‌నగర్
ఆస్పత్రుల్లో సౌకర్యాలు నిల్
నా కూతురు రెండు నెల లుగా దగ్గుతో బాధపడుతుంది. ఇక్కడ వైద్యం కోసం వస్తే మరో ఆస్పత్రికి వెళ్లమంటారు. అక్కడ పరీక్షలు చేయించుకుని వస్తే మందులు లేవంటారు. మేము ఎక్కడని తిరగాలి.
- రిహానా, గాజుల రామారం
రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది
తలకు గాయమైంది. స్థానిక వైద్యుల సూచన మేరకు వారం రోజుల క్రితం గాంధీ ఆస్పత్రికి వస్తే వైద్యపరీక్షలు నిర్వహించి పలు టెస్ట్‌లు, ఎక్స్‌రేలు రాశారు. వారం రోజులుగా ఆస్పత్రి చుట్టు తిరుగుతున్నా ప్రయోజనం లేదు.
- కృష్ణయ్య, మహబూబ్‌నగర్
వైద్యుల చుట్టూ తిరగాలి
మా అమ్మాయిని ప్రసవం కోసం ఆసుపత్రికి తీసుకొచ్చాను. వైద్యుల చుట్టూ పదిసార్లు తిరగాల్సి వస్తోంది. కింది స్థాయి సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పేదలకు ఆసుపత్రుల్లో వైద్యం సక్రమంగా అందేలా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలి.
- ఆఫ్రిన్ ఉన్నీసా, హసన్‌నగర్
చీదరించుకుంటున్నారు
సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి అసుపత్రిలో వైద్యం కోసం వెళ్లిన రోగులను సిబ్బంది చీదరించుకుంటున్నారు. వైద్యుల పరిస్థితీ అలాగే ఉంది. పేద రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేందుకు జంకే పరిస్థితి లేకుండా చూడాలి.
- కేశవ్, గోల్నాక
పడకల సంఖ్య పెంచాలి
సుల్తాన్‌బజార్ ఆసుపత్రికి వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఇక్కడ 160 పడకలున్నాయి. వీటి సంఖ్య పెంచాలి. అలాగే వైద్యులు, నర్సులు, సిబ్బంది సంఖ్యను పెంచి వచ్చే రోగులకు అనుగుణంగా వైద్య సేవలు అందించాలి.
- వనిత, నాంపల్లి
దళారుల బెడద
వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తే దళారుల బెడద ఎక్కువైంది. సమయానికి వైద్యులు కూడా అందుబాటులో లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రసవం కోసం నేను పేట్లబురుజు ఆసుపత్రికి వచ్చాను. ఇక్కడ సిబ్బంది సరిగా స్పందించడం లేదు. అంతేకాదు సరైన రీతిలో సదుపాయాలు లేవు. తీవ్ర ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తోంది.
- భాగ్యలక్ష్మి, గర్భిణి
నడుం నొప్పి తగ్గలేదు
కొన్నేళ్లుగా నడుం నొప్పితో బాధపడుతున్నాను. జిల్లా ఆస్పత్రిలో చూపిస్తే గాంధీ ఆస్పత్రికి వెళ్లమన్నారు. రెండు రోజుల కిందట గాంధీ ఆస్పత్రికి వచ్చాను. అక్కడి డాక్టర్లు ఇచ్చిన గోళీలే ఇక్కడా ఇచ్చారు. నడుం నొప్పి తగ్గలేదు సరికదా బస్సు చార్జీలు, తిండికి రూ.500 వదిలింది.
- లక్ష్మి, జనగాం, వరంగల్