అయితే హాజరు.. లేదంటే సెలవు!
► హాజరు రిజిష్టరులో సంతకం.. ఆపై సెలవు చీటీ
► ఎవరూ చూడకపోతే మరుసటి రోజు చీటీ చింపడం
► ఎండీఎం బియ్యంలోనూ అవకతవకలు
► ఇదీ మచ్చాపూర్ డీఎన్‌టీ ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం తీరు
గుడిహత్నూర్ : పాఠశాలకు ఎవరైనా ఉన్నతాధికారులు పరిశీలనకు వచ్చారనుకోండి.. అక్కడ ఎవరైనా ఉపాధ్యాయుడు గైర్హాజరు ఉంటే.. సెలవు చీటీ చూపిస్తూ.. సహ ఉపాధ్యాయుడు ఇచ్చే సమాధానం.. ‘సార్‌కు ఆరోగ్యం బాగాలేదు. సెలవుపై ఉన్నారు’ కానీ అప్పటి వరకు హాజరు పట్టీలో ఈ విషయం రికార్డు చేయరు. ఎవరూ రాలేదనుకొండి మరుసటి రోజు సెలవు చీటీ చించేసి హాజరేసుకోవడమే.. మండలంలోని మచ్చాపూర్ డీఎన్‌టీ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం గణేష్ ఉదయం పాఠశాలకు హాజరై హాజరు పట్టీలో సంతకం చేసి 10గంటల ప్రాంతంలో వెళ్లి పోయారు. వెళ్లే ముందు సెలవు పత్రం రాసి అదే హాజరు రిజిష్టరులో పెట్టి.. ఎవరైనా వస్తే ఎం చెప్పాలో కూడా ఉపాధ్యాయుడికి చెప్పి వెళ్లిపోయాడు. కాగా ఒక పూటకు సంతకం చేసి అనారోగ్యం కారణంగా వెళ్తున్నాని సెలవు చీటీలో పేర్కొన్న హెచ్‌ఎం ఒక రోజు సెలవు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా పాఠశాలలో చదువుతున్న 40 మంది విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి గాను 4 నుంచి 4.5 కిలోలు వెచ్చిస్తున్నట్లు రిజిస్టర్‌లో రికార్డు చేశారు. ఇదే విషయాన్ని ఎండీఎం నిర్వాహకులకు అడగగా నిత్యం 3కిలోల నుంచి 3.5 కిలోలు వండుతున్నట్లు తెలిపారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థులకు అందించాల్సిన సన్నబియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో సైతం హెచ్‌ఎం గణేష్ విధులకు సక్రమంగా హాజరుకావడం లేదంటూ స్థానికులు విద్యా శాఖ కమిషనుర్ టోల్ ఫ్రీ నంబరు ద్వారా ఫిర్యాదు చేశారు.
ఈ విషయమై ఎంఈవో నారాయణను వివరణ కోరగా.. అత్యవరసరంగా పాఠశాల నుంచి సెలవుపై వెళ్లాల్సి వస్తే మూవ్‌మెంటు రిజిష్టరులో నమోదు చేస్తూ.. హెచ్‌ఎం బాధ్యతలు మరో ఉపాధ్యాయుడికి అప్పగించి కాంప్లెక్స్ హెచ్‌ఎంకు గానీ, ఎంఈవోకు గాని సమాచారం అందించాలని తెలిపారు. ఎండీఎం బియ్యం నిల్వలు పాఠశాలలోనే ఉండాలని వేరే చోట ఉండడానికి వీలు లేదని పేర్కొన్నారు. ఈ విషయం ఇప్పటివరకూ తమ దృష్టికి రాలేదని పూర్తి వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామన్నారు.