
గర్భిణిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త
మగ బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తల్లి
నిజామాబాద్ క్రైం (నిజామాబాద్ అర్బన్): అదనపు కట్నం తీసుకురావాలని గర్భిణిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడో కిరాతక భర్త. తీవ్రంగా కాలిన గాయాలతో బాధపడుతున్న ఆమెను స్థానికులు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మగబిడ్డకు జన్మనిచ్చి తాను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. నిజామాబాద్ నగరంలోని నిజాం కాలనీకి చెందిన ఎస్‌కే ముజీబ్‌తో నిర్మల్ జిల్లా కాలూర్‌కి చెందిన సానాబేగం (23)కు ఏడాది క్రితం వివాహం జరిగింది. ముజీబ్ ఆటోడ్రైవర్. కొన్ని రోజుల నుంచి భర్త, కుటుంబ సభ్యులు అదనపు కట్నం తీసుకురావాలని సానాబేగంను వేధించడం మొదలు పెట్టారు.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి గర్భిణీ అని కూడా చూడకుండా భార్యను ముజీబ్ విపరీతంగా కొట్టాడు. బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో సానాబేగం ఒంటిపై ముజీబ్ కిరోసిన్ పోసి నిప్పటించాడు. మంట లకు తాళలేక ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు కొందరు నిద్రలో నుంచి మేలుకుని అక్కడకు చేరుకున్నారు. 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. సానాబేగంను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స జరుగుతుండగానే మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబు క్షేమంగా ఉన్నప్పటికీ తల్లి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఓ పక్క తాను తల్లి అయ్యానన్న సంతోషం, మరో పక్క పుట్టిన బిడ్డను కళ్లారా చూసుకునే భాగ్యం లేక తన దుస్థితికి తీవ్ర మానసిక వేదనకు గురవుతోంది. పోలీసులు బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. తన కూతురిని అత్తింటివారు అదనపు కట్నం కోసం తరచూ వేధించేవారని బాధితురాలి తండ్రి షేక్ రజాక్ ఫిర్యాదు చేశాడు. ముజీబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.