ఢీ అంటే ఢీ
- హెచ్‌సీఏ ఎన్నికల్లో హోరాహోరీ
- నిట్టనిలువునా చీలిన క్రీడా శిబిరాలు
- అధ్యక్ష పదవి కోసం వినోద్, అర్షద్ పోటాపోటీ
సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో ఎన్నికల వేడి జోరందుకుంది. అధ్యక్షపదవికి వినోద్, అర్షద్ అయూబ్ వర్గాలు హోరాహోరీ తలపడుతున్నాయి. ఇరువర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఢీ అంటే ఢీ అంటున్నాయి. 22 పదవులకు 68 మంది నామినేషన్లు దాఖలు చేశారు. క్రీడా శిబిరాలు సైతం రెండు గ్రూపులుగా చీలిపోవడంతో పోటీ రసవత్తరంగా మారనుంది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) నూతన కార్యవర్గానికి సెప్టెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి.
అధ్యక్ష పదవితో పాటు, ఐదుగురు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, రెండు సంయుక్త కార్యదర్శులు, కోశాధికారి పదవితో పాటు పన్నెండు మంది కార్యవర్గ సభ్యులను ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఎన్నికల వేడి జోరందుకుంది. కార్యవర్గంలోని 22 పోస్టుల కోసం 68 మంది 121 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో పోటీదారుల వివరాలను ఎన్నికల అధికారి వెల్లడించటంతో ఆయా శిబిరాలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు దృష్టి సారించాయి.
అధ్యక్ష పదవి కోసం నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నా ప్రధాన పోటీ హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు గడ్డం వినోద్, అర్షద్ అయూబ్‌ల మధ్యే ఉంది. హెచ్‌సీఏలో గుర్తింపు పొందిన ప్రతి క్లబ్‌కు ఒక ఓటు ఉండటంతో వారిని తమ వైపు తిప్పుకునేందుకు రెండు వర్గాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ప్రస్తుతం ప్రతి క్లబ్‌కు ఇస్తున్న క్రికెట్ డెవలప్‌మెంట్ ఫండ్‌ను రెండింతలు చేయటం, ప్రతి క్లబ్ సెక్రటరీకి రూ.10వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తామన్న హామీలతో పాటు సెలక్లర్లు, కోచ్‌లుగా నియమిస్తామని, సంబంధిత క్లబ్ పరిధిలోని గ్రౌండ్‌ను హెచ్‌సీఏ లీజుకు తీసుకునేలా నిర్ణయం చేస్తామన్న హామీలు గుప్పిస్తున్నారు.
రెండుగా చీలిన క్రికెట్ శిబిరాలు
ఎన్నికల నేపథ్యంలో హెచ్‌సీఏ పరిధిలోని క్రీడాశిబిరాలు రెండుగా చీలిపోయాయి. 2012-14 కార్యవర్గంలోఎన్నికైన శివలాల్ యాదవ్, వెంకటపతి రాజు, విద్యుత్ జయసింహ, వంకా ప్రతాప్ ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. మిగిలిన ముఖ్యులంతా రెండు శిబిరాలుగా విడిపోయారు. వినోద్ శిబిరం నుంచి ఉపాధ్యక్ష పదవికి డాక్టర్ ఎంవీ శ్రీధర్, వివేక్, ప్రగతి మహేందర్, వెంకట్రాంరెడ్డి, చిట్టి శ్రీధర్, కార్యదర్శిగా వెంకటేశ్వరన్, సహాయ కార్యదర్శులుగా టి.బసవరాజు, కళ్యాణ చక్రవర్తి, కోశాధికారి పదవికి నరేష్ శర్మలు పోటీలో నిలిచే అవకాశం ఉంది.
అర్షద్ అయూబ్ శిబిరం నుంచి యాదగిరి, నరేందర్‌గౌడ్, దేవరాజ్, పురుషోత్తం అగర్వాల్ తదితరులు బరిలోకి దిగారు. అయితే అయూబ్ శిబిరం బల్క్ ఓటర్లు (ఒకే వ్యక్తుల చేతిలో ఒకటికి మించిన క్లబ్‌లు) తమ వైపే ఉంటారన్న భావనతో ముందుకెళ్తుండగా, వినోద్ శిబిరం మాత్రం ఇన్‌స్టిట్యూషన్స్ (బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల ఓట్లు)పై పూర్తి నమ్మకం పెట్టుకుంది. అయితే ఫలితాన్ని శాసించే స్థాయిలో ఉన్న సింగిల్ క్లబ్స్ ఓటర్లు ఎటు మొగ్గితే వారే విజయం సాధించే అవకాశం ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
హెచ్‌సీఏలో తల దూర్చనన్న కేటీఆర్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు ప్రస్తుతం తాజా మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చీఫ్ ప్యాట్రన్‌గా ఉండగా ఆయన స్థానంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీర్‌ను ఉపాధ్యక్షుడిగా నామినేట్ చేసే విధంగా హెచ్‌సీఏ నిబంధనలను మార్చాలని తొలుత భావించినట్టు తెలిసింది. అయితే హెచ్‌సీఏలో నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎన్నికలకు దూరంగా ఉండాలని భావించినట్టు సమాచారం. వాస్తవానికి హెచ్‌సీఏలో తెలంగాణ జిల్లాల పేర్లతో హైదరాబాద్‌కే చెందిన వారు ప్రాతినిథ్యం వహిస్తుండటం, క్రికెట్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న క్లబ్‌లకు బదులు పది మంది చేతిలోనే యాభైకి పైగా క్రికెట్ క్లబ్‌లు ఉన్న అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉండటంతో కేటీఆర్ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం.