సాక్షి, హైదరాబాద్: పోలింగ్ విధులను నిర్వర్తిస్తున్న పోలీసులు, ఇతర అధికారులు ఏ రాజకీయ పార్టీ పట్ల ఆశ్రిత పక్షపాతం చూపడానికి, ఎవ్వరినీ ప్రభావితం చేయడానికి వీల్లేదని హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. తమకు నిర్దేశించిన కార్యకలాపాలు, బాధ్యతలను ఎవరైనా ఉల్లంఘిస్తే, ఆ అధికారుల జాబితాను సీల్డ్ కవర్‌లో తమ ముందుంచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీఐ), రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)ని హైకోర్టు ఆదేశించింది. ఉల్లంఘనుల నివేదికను తమ ముందుంచడం ద్వారా రాజ్యాంగంలోని అధికరణ 226 కింద తమకున్న అధికార పరిధిని ఉపయోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞల ఉల్లంఘన జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందని పేర్కొంది.
ఎలాంటి అవాంఛనీ య ఘటనలు జరగకుండా ఈసీఐ, సీఈవో ఆదేశాలు, మార్గదర్శకత్వంలో విధులు నిర్వర్తించాలని పోలీసులు, ఇతర అధికారులను హైకోర్టు ఆదేశించింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన కేంద్ర బలగాలను సిద్ధం చేసుకుని ఉండాలని ఈసీ ఐ, సీఈవోలకు స్పష్టం చేసింది. పాతబస్తీ పరిధిలోని 8 నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల సంఘం గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికలు జరిగిన తీరు తెన్నులపై ఆ పోలింగ్ కేంద్రాల ఇన్‌చార్జి అధికారులు నివేదికలను తయారుచేసి వాటిని సీఈవో ద్వారా తమ ముందుంచాలని ఆదేశించింది. ఈ నివేదికలను సోమవారం ఉదయం పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.
ప్రశాంతంగా జరిగేలా చూడండి..
ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు వీలుగా ఓటర్లను వీడియోగ్రఫీ చేయడంతో పాటు పోలింగ్ రోజున ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను, వారి ఏజెంట్లను మినహా, మిగిలిన ఎవ్వరినీ కూడా పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించకుండా ఎన్ని కల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) అధ్యక్షుడు మజీదుల్లాఖాన్, నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్‌లు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై గురువారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. గతంలో ఎన్నికల సందర్భంగా పాతబస్తీ పరిధిలోని 8 నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రా ల్లో మాజీ ఎమ్మెల్యే, ఎంపీలు గన్‌మెన్‌లతో కలిసి చొరబడి వాటిని స్వాధీనం చేసుకుని ఓటర్లను బెదిరించారని, ఈసారి కూడా అటువంటి పరిస్థితి పునరావృతమయ్యే అవకాశం ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ వాదనలను ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాష్ దేశాయ్ తోసిపుచ్చారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, పాతబస్తీ పరిధిలోని 8 నియోజకవర్గాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాం తంగా జరిగేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు, అనవసరమైన వివాదాలకు తావివ్వకుండా పోలీసులు, ఇతర అధికారులు వ్యవహరించేలా చూడాలని ఈసీఐ, సీఈవోలను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment