సాక్షి, సిటీబ్యూరో: మన్సూరాబాద్‌కు చెందిన సురేష్(పేరు మార్చాం) అనే యువకుడు కోవిడ్ లక్షణాలతో ఆందోళనకు గురయ్యాడు. అనుమానం ఉండటంతో సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకు వనస్థలిపురంలోని ఏరియా ఆస్పత్రికి వెళ్లాడు. యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్‌లో నెగెటివ్ అని తేలింది. కానీ తనకు ఉన్న లక్షణాలు అతడిని మరింత కుంగదీశాయి. ఓ ప్రైవేట్ లాబొరేటరీకి వెళ్లాడు. సీటీ స్కాన్‌లో కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు స్పష్టమైంది. కానీ ఆ నివేదిక ఆధారంగా అతడికి కోవిడ్ చికిత్స చేసేందుకు గాంధీ ఆస్పత్రి వైద్యులు నిరాకరించారు. దీంతో కింగ్‌కోఠి హాస్పిటల్‌లో మరోసారి పరీక్ష చేసుకోవాల్సి రావడంతో పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చేర్చుకున్నారు. యాంటిజెన్ ర్యాపిడ్ పరీక్షల్లోని డొల్ల తనానికి నిదర్శనం ఇది. ఒక్క సురేష్ మాత్రమే కాదు. చాలామంది ఈ పరీక్షల వల్ల సరైన ఫలితాలు లభించక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
కరోనా లక్షణాలను గుర్తించేందుకు సత్వర ఫలితాల కోసం ప్రవేశపెట్టిన ర్యాపిడ్ పరీక్షల నిర్వహణలో చిత్తశుద్ధి కొరవడుతున్నట్లు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 88 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో యాంటిజెన్ పరీక్షలను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.. కానీ నమూనాల సేకరణ మొదలుకొని ఫలితాలను వెల్లడించడం వరకు చాలాచోట్ల గందరగోళం నెలకొంటోంది. దీంతో బాధితులు ఒకటికి రెండుసార్లు పరీక్షా కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది.
తప్పని పడిగాపులు.. తప్పుడు ఫలితాలు..
హస్తినాపురం ప్రాంతానికి చెందిన ఓ బిల్డర్‌కు సీటీస్కాన్ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన యాంటి జెన్ పరీక్షకు వెళ్లాడు. అక్కడ నెగెటివ్ అని రిపోర్ట్ రావడంతో బిత్తరపోయాడు. íసీటీస్కాన్ ఆధారంగా సర్కార్ దవాఖానాలో చేర్చు కొనేందుకు నిరాకరించడంతో ప్రస్తుతం ఇంటి దగ్గరే హోంఐసోలేషన్‌లోనే ఉండి మందులు వాడుకుంటున్నాడు. బాధితులు యాంటిజెన్ పరీక్షల కోసం గంటల తరబడి పడిగాపులు కాసినా.. చివరకు తప్పుడు ఫలితాలతో ఆందోళనకు గురికావాల్సి వస్తోంది. ప్రధాన ఆస్పత్రుల్లో పరీక్షలను తగ్గించి చికిత్సలకే పరిమితం చేశారు. దీంతో జనం కరోనా పరీక్షల కోసం ప్రాథమిక కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుంది. కానీ ఈ కేంద్రాల్లో సకాలంలో వైద్య పరీక్షలు లభించక గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుంది.
నాలుగు గంటల పాటు క్యూలో..
‘తెల్లవారు జామున 5 గంటలకు వచ్చి క్యూలో నిలబడితే ఉదయం 9 గంటలకు నమూనాలు తీసుకున్నారు. నాలుగు గంటలు పడిగాపులు తప్పలేదు. ఇక ఉదయం పూట వచ్చిన వాళ్లు మధ్యాహ్నం వరకు క్యూలో వేచి ఉండక తప్పడం లేదు.’ అని కొండాపూర్ ఆరోగ్య కేంద్రంలో పరీక్షకు వెళ్లిన ఒక బాధితుడు విస్మయం వ్యక్తం చేశారు. గంటల తరబడి ఎదురుచూసినా ఫలితాల్లో గందరగోళం కారణంగా మరింత భయాందోళనకు గురికావాల్సి వస్తోందని చెప్పారు. మరోవైపు ‘క్యూలో ఎక్కువ సేపు ఉండటం వల్ల కూడా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉంది. ఇలాంటి సమయాల్లో అకస్మాత్తుగా వర్షం వచ్చినప్పుడు కరోనా ఉన్నవాళ్లు, లేనివాళ్లు అంతా ఒక్కచోట చేరి ఆరోగ్య కేంద్రాలే వైరస్ వ్యాప్తికి అడ్డాలుగా మారే ప్రమాదం ఉన్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
స్లాట్‌సిస్టమ్ మంచిది..
కరోనా వైద్య పరీక్షల కోసం ఒక్కసారి ఎక్కువ మంది వచ్చి గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకుండా స్లాట్ పద్ధతిని అందుబాటులోకి తీసుకువస్తే బాగుంటుంది. యాంటిజెన్ పరీక్షా కేంద్రాలపైన విస్తృత ప్రచారం చేయడంతో పాటు ఒక్కో ఆస్పత్రిలో చేసే పరీక్షల సంఖ్యకు అనుగుణంగా బాధితులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తే రద్దీ తగ్గుతుంది. పరీక్షల్లో నాణ్యత, పారదర్శకత పెరుగుతుంది.
యాంటిజెన్ అలా.. ఆర్టీపీసీఆర్ ఇలా..
నిజానికి యాంటిజెన్ ర్యాపిడ్ పరీక్షలకు ముందు ప్రధాన ఆస్పత్రుల్లో ఆర్టీïసీపీసీఆర్ పద్ధతిలోనే వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఫలితాలు వెలువడేందుకు 24 గంటల సమయం పడుతుంది. కానీ ర్యాపిడ్ టెస్టుల్లో అరగంటలోనే ఫలితాలు తెలిసిపోతాయి. ర్యాపిడ్ టెస్టులు అందుబాటులోకి రావడంతో ప్రధాన ఆస్పత్రుల్లో ఆర్టీపీసీఆర్ తగ్గించారు. యాంటిజెన్ పరీక్షలను విస్తృతం చేశారు. ఆలస్యమైనా ఆర్టీపీసీఆర్ పరీక్షల్లోనే ఎక్కువ ఖచ్చితత్వం ఉంటుందని సీనియర్ వైద్యనిపుణులు ఒకరు తెలిపారు.
‘అత్యవసరం’లోనే యాంటిజెన్
సాధారణంగా వైరస్ ఊపిరితిత్తుల్లోంచి రక్తంలో కలిన తర్వాత మాత్రమే యాంటిజెన్ ర్యాపిడ్ పరీక్షలు చేయడం వల్ల ఫలితం ఉంటుంది. కానీ వైరస్ గొంతులో, శ్వాసనాళాలు, ఊపిరితిత్తుల్లో ఉన్నప్పుడు యాంటిజెన్ పరీక్షల వల్ల 50 నుంచి 60 శాతం ఫలితాలే ఉంటాయి. యాక్సిడెంట్ల వంటి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ పరీక్షలు చేస్తారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో మాత్రమే ఖచ్చితమైన ఫలితాలు తెలుస్తాయి. కానీ ఆలస్యమవుతుంది. ఇక ఊపిరితిత్తుల్లో ఉండే వైరస్‌ను గుర్తించేందుకు సిటీస్కాన్ చేయడం ఎంతో ఉత్తమం. – డాక్టర్ రఫీ, పల్మనాలజిస్టు, కేర్ ఆస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment