దుర్గంచెరువు భాగ్యనగరానికే ఐకాన్‌ | Hyderabad Lakes To Be Developed As Tourist Destinations | Sakshi
Sakshi News home page

లేక్‌ సిటీ

Published Thu, Dec 5 2019 11:11 AM | Last Updated on Thu, Dec 5 2019 11:35 AM

Hyderabad Lakes To Be Developed As Tourist Destinations - Sakshi

ముచ్చట గొలిపే ప్రకృతి అందాలు.. మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ కాంతులతో చెరువులు కొత్త అందాలను సంతరించుకోనున్నాయి. దుర్గం చెరువుతోపాటు మరో 14 చెరువులు సరికొత్త రూపు దాల్చనున్నాయి. కార్పొరేట్‌ కంపెనీల సహకరంతో పలు చెరువులు సుందర తటాకాలుగా మారనున్నాయి. ఆయా చెరువులను ప్రభుత్వం టూరిజం కేంద్రాలుగా మార్చనుంది.  

గచ్చిబౌలి: దుర్గం చెరువు కొద్ది నెలల్లోనే టూరిజం స్పాట్‌గా మారనుంది. అమెరికాలోని లాస్‌వెగాస్‌ లేక్‌ మాదిరిగా వాటర్‌ ఫ్లోటింగ్‌ లైట్లతో దుర్గం చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. రాత్రి సమయంలో కేబుల్‌ బ్రిడ్జిపై విద్యుత్‌ కాంతులు వెదజల్లనున్న ఎల్‌ఈడీ లైట్లకు ఫ్లోటింగ్‌ లైట్లు తోడుకానున్నాయి. చెరువు చుట్టూ 4 కిలోమీటర్లు చైనా ఫ్లోటింగ్‌ లైట్లను  ఏర్పాటు చేయనున్నారు. మార్చి నాటికి  లైట్లను అమర్చేందుకు ప్రణాళిక సిద్ధమైంది. చెరువుపై కేబుల్‌ బ్రిడ్జి, చుట్టూ వాకింగ్, సైక్లింగ్‌ ట్రాక్‌లు, గ్రీనరీ, ఒక వైపు కేబుల్‌ బ్రిడ్జి, మరో వైపు దుర్గం చెరువు అభివృద్ధితో చెరువును చూసేందుకు ఆసక్తి కనబర్చుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

సుందర తటాకంగా దుర్గం చెరువు భాగ్యనగరానికే ఐకాన్‌గా మారనుంది. ఓల్డ్‌ ముంబయ్‌ జాతీయ రహదారిని అనుకొని ఉన్న ఖాజాగూడలోని పెద్ద చెరువుకు కొత్త హంగులు దిద్దనున్నారు. వెల్స్‌ ఫార్గో కంపెనీ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటి (సీఎస్‌ఆర్‌)లో భాగంగా చెరువును అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. ఐటీ కారిడార్‌లోని 14 చెరువుల అభివృద్ధి పనులను ఆయా కంపెనీలు చేపడుతున్నాయి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో చెరువుల అభివృద్ధికి గ్లోబల్‌ క్‌లైమేట్‌ ఫండ్‌ వెయ్యి కోట్ల నిధులను అందించనుందని జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్, వెస్ట్‌ జోనల్‌ కమిషనర్‌ హరిచందన దాసరి తెలిపారు.

 

దుర్గం చెరువు చుట్టూ ఫ్లోటింగ్‌ లైట్లు.. 
కె.రహేజా కార్పోరేట్‌ కంపెనీ దుర్గం అభివృద్ధికి ఇప్పటికే దాదాపు రూ.20 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దుర్గం చెరువును టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దాలని ప్రతిపాదించడంతో కె.రహేజా గ్రూపు చెరువు చుట్టూ 4 కిలోమీటర్లు రూ.3.5 కోట్ల విలువైన వాటర్‌లో ఫ్లోటింగ్‌ లైట్లు, వాటర్‌ ఫౌంటేన్‌లు అమర్చనున్నారు. ఇప్పటికే చైనాకు చెందిన కంపెనీలకు ప్రతిపాదనలు పంపగా రెండు నమునాలను రహేజా గ్రూపుకు పంపారు. మరో రెండు నమూనాలు రావాల్సి ఉంది. కొద్ది రోజుల్లోనే జీహెచ్‌ఎంసీ అమోదం తెలుపనుంది.

ఎంట్రెన్స్‌ ప్లాజా, చిల్డ్రన్స్‌ ప్లే ఏరియా, గ్రీనరీ , ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటు చేసింది.  
చుట్టూ 4 కిలో మీటర్ల పొడవునా 7 మీటర్ల వెడల్పులో‡ వాకింగ్, సైక్లింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తున్నారు.  u రెండు ట్రాక్‌ల మధ్య గ్రీనరీ ఏర్పాటు చేస్తారు.  
100 మీటర్ల పొడవున స్కై వాక్‌ రానుంది. 
ఆంపి థియేటర్‌ రానుంది. 

పెద్ద చెరువు కొత్త సొబగులు... 
ఓల్డ్‌ ముంబయ్‌ జాతీయ రహదారి నుంచి ఖాజాగూడ వరకు విస్తరించి ఉన్న పెద్ద చెరువును కొత్త హంగులతో తీర్చిదిద్దనున్నారు. వెల్స్‌ ఫార్గొ కంపెనీ   మూడు కోట్లకు పైనే నిధులతో పెద్ద చెరువును అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. అభివృద్ధి పనులను యునైటెడ్‌ వేస్‌ సంస్థకు అప్పగించింది. ఇప్పటికే ట్రాక్‌ పనులు ప్రారంభమయ్యాయి. చెరువు చుట్టు రెండు కిలోమీటర్లు వాకింగ్‌ ట్రాక్, అర కిలోమీటరు సైక్లింగ్‌ ట్రాక్‌ ఉంటుంది. గ్రీనరీ, ల్యాండ్‌స్కేప్, చిల్డ్రెన్స్‌ ప్లే ఏరియా, బటర్‌ ఫ్లై పార్క్, హెర్బల్‌ గార్డెన్, చెరువులోని నీటిని శుద్ధి చేసేందుకు 5 వేల వెట్‌లాండ్‌ మొక్కలు నాటనున్నారు. ఎంట్రెన్స్, ఎగ్జిట్‌ ప్లాజా, టాయిలెట్లు ఏర్పాటు చేస్తారు.


 

14 చెరువుల అభివృద్ధి ... 
ఐటీ కారిడార్‌లోని  చెరువులు, కుంటలను అభివృద్ధి చేసేందుకు వివిద కంపెనీలు ముందకు వచ్చాయి. కొన్ని కంపెనీలు చెరువులæఅభివృద్ధి పనులను వేగంగా చేపడుతున్నాయి. దుర్గం చెరువు– కె.రహేజా గ్రూపు, పెద్ద చెరువు–వెల్స్‌పార్గొ, మల్కం చెరువు–అపర్ణ, బర్లకుంట–జేపి మోర్గాన్, కుడికుంట–పెర్నాడ్‌ రికార్డ్, మేడికుంట–ఎక్సిగాన్, నల్లగండ్ల చెరువు–అపర్ణ, ప్రగతినగర్‌ చెరువు– శ్రీశ్రీ ఫౌండేషన్, నిథమ్‌ చెరువు, ఎల్లమ్మ చెరువులను ఈఎఫ్‌ఐ అభివృద్ధి చేస్తోంది. కొండాపూర్‌లోని రంగన్న కుంటతో పాటు మరో మూడు చెరువులను అభివృద్ధి చేసేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయి. 

చెరువుల అభివృద్ధికి వెయ్యి కోట్లు... 
వివిధ చెరువుల అభివృద్ధికి దక్షిణి కొరియాలోని గ్లోబల్‌ క్లైమేట్‌ ఫండ్‌  వెయ్యి కోట్ల నిధులు అందించనుంది. జీహెచ్‌ఎంసీకి రెండు విడతలుగా రూ.400 కోట్లు , హెచ్‌ఎండీఏకు రూ.600 కోట్లు ఇవ్వనున్నారు.  ఇలా 14 చెరువులను
అభివృద్ధి చేయనున్నాం. 
– హరిచందన దాసరి, అడిషనల్‌ కమిషనర్, వెస్ట్‌ జోనల్‌ కమిషనర్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement