సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని పలు చెరువులు విషాన్ని చిమ్ముతున్నాయి. బుసలు కొడుతున్న నురగ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఎప్పుడు ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని విధంగా చెరువుల్లో నురగ ప్రమాదకర స్థాయికి చేరుకుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దఎత్తున వచ్చి చేరుతున్న విష రసాయనాలు, పారిశ్రామిక, గృహ వ్యర్థాలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటి వరకు చెరువుల్లో నురగపై కొన్ని తాత్కాలిక నివారణ పద్ధతులను అమలు చేస్తున్నప్పటికీ అలాంటి తాత్కాలిక చర్యలు ఎంతో కాలం కొనసాగించలేమని, శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని పలువురు నిపుణులు హెచ్చరించారు. సీఎస్‌ఐఆర్ అనుబంధ నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (నీరి) గత రెండు సంవత్సరాలుగా నగరంలోని పలు చెరువులపై అధ్యయనం చేపట్టింది. ఈ క్రమంలో నురగ నివారణ కార్యాచరణలో భాగంగా మంగళవారం మొట్టమొదటిసారి ‘నురగపొంగుతున్న చెరువులు– కారణాలు, నివారణ చర్యలు’ అన్న అంశంపై మేధోమధన సదస్సు నిర్వహించింది. బెంగళూరు, కోల్‌కత్తా, చెన్నై, ముంబయి, దిల్లీ, తదితర నగరాలకు చెందిన పర్యావరణ నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారు. వ్యర్ధాలను చెరువుల్లోకి వదలకుండా అరికట్టడమే తక్షణ నివారణ మార్గమని, వరద నీటిని ఎక్కడికక్కడే భూమిలోకి ఇంకిపోయే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు నిపుణులు సూచించారు.
ఆదమరిస్తే బెలందూర్ చెరువే...
గ్రేటర్ పరిధిలో సుమారు 185 చెరువులు ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ గుర్తించింది. వీటిలో కొన్ని ఆక్రమణలకు గురయ్యాయి. చాలా వరకు చెరువులన్నీ రకరకాల వ్యర్ధాలతో నిండిపోయినట్లు పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా సంస్థల నుంచి వచ్చే ప్రమాదకరమైన విషరసాయనాలతో చెరువులు పూర్తిగా కలుషితమయ్యాయని, అలాగే పరిశ్రమలు, ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు కూడా చెరువులకు ముప్పుగా పరిణమించిందని పేర్కొంటున్నారు. ఈ వ్యర్ధాల మూలంగానే వెల్లువెత్తుతున్న నురగ కొన్ని చెరువుల్లో ప్రమాదకరస్థాయికి చేరుకుంది. నగరంలోని ఇబ్రహీం చెరువు, ఆర్‌కె పురం చెరువు, హస్మత్‌పేట్, ఉప్పల్ నల్లచెరువు, కూకట్‌పల్లి చెరువులలో నురగ స్థాయిలు బాగా పెరిగినట్లు ‘నీరి’ అధ్యయనంలో వెల్లడైంది. ఈ నురగను నిర్లక్ష్యం చేస్తే బెంగళూర్‌లోని బెలందూర్ లేక్ తరహాలో నురగ పొంగి రోడ్లపైకి, ఇళ్లల్లోకి వచ్చే ప్రమాదం ఉన్నట్లు ‘నీరి’ హెచ్చరించింది. అత్యంత ప్రమాదకరమైన ఈ నురగ వల్ల బెలందూర్ ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. విషపూరితమైన రసాయనాలతో కూడిన నురగ పొగలుకక్కుతూ ఇళ్లల్లోకి ప్రవహించింది. దీంతో చర్మవ్యాధులు ప్రబలాయి. తలనొప్పి, దద్దుర్లు వంటి సమస్యలు తలెత్తాయి. రోడ్లపైన నురగ కారణంగా వాహనాల రాకపోకలకు సైతం తీవ్ర ఆటంకం తలెత్తింది. వర్షం వచ్చినప్పుడు పోటెత్తే వరద నీటితో పాటు మురుగు నీరు, వ్యర్ధాలు ఈ చెరువులో పెద్ద ఎత్తున వచ్చి చేరినట్లు సైంటిస్టులు గుర్తించారు. అలాంటి ముప్పే నగరంలోని చెరువులకు కూడా ఉన్నట్లు నీరి సైంటిస్టుల అధ్యయనం స్పష్టం చేస్తోంది.
యాంటీ ఫోమింగ్ ఏజెంట్‌లు తాత్కాలికమే...
‘ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా అన్ని మెట్రో పాలిటన్ నగరాల్లోను నురగ ముప్పు ఏదో ఒక స్థాయిలో ఉంది. దీనిని నివారించేందుకు చేపట్టవలసిన చర్యలపైన ఇది మొట్టమొదటి మేధోమధన కార్యక్రమం. ఇలాంటివి మరిన్ని నిర్వహించవలసి ఉంది.’ అని సీఎస్‌ఐఆర్–నీరి సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ షేక్ బాషా తెలిపారు. ఇప్పటి వరకు యాంటీ ఫోమింగ్ ఏజెంట్‌లను వినియోగిస్తూ నురగను నియంత్రిస్తున్నారు. కొన్ని చోట్ల నానో పార్టికల్స్‌ను చెరువులపైన చల్లుతున్నారు. ఇలాంటివి తాత్కాలికమే. వరద నియంత్రణ, చెరువుల పరిరక్షణ మాత్రమే సరైన పరిష్కారం.’ అని చెప్పారు. నగరంలోని చెరువులన్నీ పెద్ద ఎత్తున ఆక్రమణకు గురవుతున్నాయని, రూ.వందల కోట్లు వెచ్చించి చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నప్పటికీ ఏ ఒక్క చెరువులోని వ్యర్ధాల ప్రవాహాన్ని ప్రభుత్వం నిలపలేకపోయిందని సామాజిక కార్యకర్త, పర్యావరణ నిపుణులు లుబ్నా సర్వత్ ఆందోళన వ్యక్తం చేశారు. రూ.360 కోట్లతో హుస్సేన్‌సాగర్ చెరువు ప్రక్షాళన చేపట్టారు. కానీ పారిశ్రామిక, ఫార్మా వ్యర్ధాల వెల్లువ ఏ కొంచెం కూడా తగ్గలేదని విస్మయం వ్యక్తం చేశారు. వరద నీటిని ఎక్కడికక్కడే భూమిలోకి ఇంకిపోయేవిధంగా చర్యలు తీసుకొంటే తప్ప చెరువులను కాపాడుకోవడం సాధ్యం కాదన్నారు. ఈ మేదోమధన సదస్సులో ఎన్విరాన్‌మెంటల్ బయోటెక్నాలజీ అండ్ జినోమిక్స్ హెడ్, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ హెమంత్ జె.పురోహిత్, గ్రౌండ్ వాటర్ డైరెక్టర్ డాక్టర్ పండిత్ మధునూరే, డాక్టర్ అత్యా కప్లే, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment