మెట్రో అలైన్‌మెంట్ మార్పుపై జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్, అక్బరుద్దీన్, ఇతర ఉన్నతాధికారులు
* మెట్రో అలైన్‌మెంట్ మార్పుపై ముఖ్యమంత్రి కేసీఆర్
* మూడు చోట్ల మార్పులకు ప్రతిపాదన
* పాతబస్తీలో మెట్రో అలైన్‌మెంట్ మార్పుపై సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, ముస్లింల ప్రార్థనామందిరాలు, ప్రజల మనోభావాలతో ముడిపడిన ఇతర చిహ్నాలకు ఎలాంటి విఘాతం కలగకుండా ‘మెట్రో’ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. మూడుచోట్ల మెట్రోరైలు మార్గాన్ని మార్చాలని ఇదివరకే తాము ఎల్ అండ్ టీకి స్పష్టం చేసినట్లు వివరించారు. పాతబస్తీలో అలైన్‌మెంట్ మార్పునకు సంబంధించి ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శులతో సీఎం కేసీఆర్ మంగళవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
గతంలో సూచించిన మార్పులకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన నేపథ్యంలో ఎక్కడెక్కడ మార్పులు అవసరం, మెట్రో రైలు ఏ మార్గం నుంచి వెళ్లాలనే వివరాలను ఎల్ అండ్ టీకి అధికారికంగా తెలియజేసేందుకు ముఖ్యమంత్రి ఈ సమావేశాన్ని నిర్వహించారు. అసెంబ్లీ భవనంతోపాటు, ప్రజల మనోభావాలతో ముడిపడివున్న తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అసెంబ్లీ వెనుకవైపు నుంచి వెళ్లేలా మొదటి మార్పు... వ్యాపార కేంద్రంగా పేరొందిన సుల్తాన్‌బజార్, బడిచౌడి మధ్యనుంచి కాకుండా ఉమెన్స్ కళాశాల వెనుకవైపు నుంచి వెళ్లేలా రెండో మార్పు ఉండాలని సూచించినట్టు తెలిపారు.
ఇక, పాతబస్తీలో ప్రస్తుతం ఉన్న అలైన్‌మెంట్ ప్రకారం నిర్మాణం జరిగితే ఏడు హిందూ దేవాలయాలు, 28 ముస్లింల ప్రార్థనా మంది రాలు, వెయ్యి నివాసగృహాలు దెబ్బతింటాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. ఇక్కడ అలైన్‌మెంట్ మార్పుతో అక్కన్న మాదన్న దేవాలయం, జగదీష్ టెంపుల్, బంగారు మైసమ్మ, లక్ష్మి నర్సింహ దేవాలయంతోపాటు ఆజాఖానా జోపురా, అసుర్‌ఖానా నాల్ ముబారక్, ఇత్తెబార్‌చౌక్ మసీదు. కోట్లా మసీదు తదితర ఆధ్యాత్మిక కట్టడాలకు ఇబ్బంది ఉండదని తెలిపారు. ఈ ప్రతిపాదనలకు సంబంధించి అలైన్‌మెంట్ వివరాలను ప్రభుత్వం అధికారికంగా ఎల్ అండ్‌టీకి అందించనుంది. ఇదిలాఉండగా, పాతబస్తీలో మెట్రోరైలు అలైన్‌మెంట్‌కు సంబంధించి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూడా కొన్ని ప్రతిపాదనలు చేశారు.
అభివృద్ధిలో భాగస్వాములవుతాం
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో తామూ భాగస్వాములవుతామని ఎల్‌అండ్‌టీ గ్రూపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎఎం నాయక్ స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన రాసిన లేఖ విశేషాలను సీఎం కార్యాలయం మంగళవారం విడుదల చేసింది. రాష్ట్రంలో విద్యుత్, మౌలిక సదుపాయాల రంగంలో పనిచేస్తామని, ఉభయ ప్రయోజనం ఉండాలన్నది తమ అభిమతమని నాయక్ వివరించారు.
ఈ నెల 15న ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ఆయన ప్రదర్శించిన దీర్ఘకాలిక అభివృద్ధి పథకాలు, ముందుచూపు నచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన సుదీర్ఘ పోరాటం తమకు తెలుసునని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సంపూర్ణ అభివృద్ధితోపాటు సామాజిక, ఆర్థికాభివృద్ధిపై ముఖ్యమంత్రి విజన్ తమను ప్రభావితం చేసిందన్నారు. గుజరాత్‌లోని హజిరాలో ఎల్‌అండ్‌టీ నిర్మించిన ప్రసిద్ధ తయారీ రంగ సంస్థను సందర్శించాలని ఆ లేఖలో కేసీఆర్‌ను కోరినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం వివరించింది.