
సాక్షి, హైదరాబాద్: విశ్వనగర వెలుగు జిలుగులు విశ్వవ్యాప్తం కానున్నాయి! ఇప్పటికే ఐటీ, ఫార్మాతోపాటు అనేక రంగాల్లో దూసుకెళ్తున్న మన భాగ్యనగరం అంతర్జాతీయ యవనికపై మరోసారి తళుకులీననుంది. వచ్చే పది రోజులపాటు ప్రపంచ చిత్రపటంలో తనదైన ప్రత్యేకతను చాటనుంది. నగర ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసే 2 కీలక ఘట్టాలను తన సిగలో పొదువుకోనుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈసీ)కు వేదికగా నిలవడం మొదటిది కాగా.. నగర రవాణా, ఆర్థిక, సామాజిక ముఖచిత్రాన్నే మార్చేసే కలల మెట్రో పట్టాలెక్కనుండటం రెండోది!! 28 నుంచి మూడ్రోజులపాటు జరగనున్న జీఈసీ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. దేశవిదేశాల నుంచి 1,500 మందికిపైగా ప్రతినిధులు తరలిరానున్నారు. 28న సాయంత్రం అంగరంగ వైభవంగా ఈ సదస్సు ప్రారంభం కానుంది.
మొదటిరోజు.. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఐదుగురు మహిళా పారిశ్రామికవేత్తలు ప్రసంగిస్తారు. రెండోరోజు కూడా ‘ఆమె’ ఇతివృత్తంగానే అనేక చర్చాగోష్టులు జరుగుతాయి. ఇక మూడోరోజు కీలకమైన 25 అంశాలపై చర్చలు నిర్వహిస్తారు. ఈ సదస్సు కోసం నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. రోడ్లు, ఫ్లైఓవర్లు తళుక్కుమంటున్నాయి. వీధుల్లో చెత్తచెదారం మాయమైపోతోంది. అదే సమయంలో నగరం భద్రత గుప్పిట్లోకి వెళ్తోంది. ఇవాంక, ప్రధాని మోదీలతోపాటు వీవీఐపీలు రానుండడంతో ఎస్పీజీ, అమెరికా భద్రతా బలగాలు రంగంలోకి దిగనున్నాయి. నగరంలో మొత్తంగా 3 వేల మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద హై అలర్ట్‌ను ప్రకటించారు. సదస్సు జరిగే ప్రాంతంలోని ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేలా కంపెనీలు చర్యలు చేపట్టాయి.
ఇక 28నే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మెట్రో రైలు పట్టాలెక్కబోతోంది! మియాపూర్‌లో రైలును ప్రారంభించి అక్కడ్నుంచి ఎస్సార్‌నగర్ వరకు 12 కి.మీ. మేర ఆయన ప్రయాణిస్తారు. మెట్రో ఇలా ఒకేసారి 30 కి.మీ. మేర ప్రారంభించడం దేశంలో ఇదే తొలిసారి. అలాగే ప్రపంచంలోనే పీపీపీ పద్ధతిలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు కూడా ఇదే. ఒంటిస్తంభం పిల్లర్లపై కారిడార్లతోపాటు స్టేషన్లు నిర్మించడం ఇంజనీరింగ్ అద్భుతంగా చెబుతున్నారు. ఈ నెలలో ఈ రెండు ఘట్టాలు ముగియగానే వచ్చేనెల 15 నుంచి 19 వరకు ప్రపంచ తెలుగు మహాసభలకు నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. అలాగే ఫిబ్రవరిలో అంతర్జాతీయ ఐటీ సదస్సు జరగనుంది. మొత్తంగా రానున్న మూడు నెలలపాటు హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించనుంది.