
నాకు డిప్యూటీ స్పీకర్ వద్దు..!: పద్మా దేవేందర్‌రెడ్డి
తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టడానికి ఎం.పద్మా దేవేందర్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేయడంలేదు. డిప్యూటీ స్పీకర్‌గా ఉంటే రాజకీయంగా నష్టపోతానని, దానికన్నా ఎమ్మెల్యేగా ఉంటేనే మంచిదని పేర్కొంటున్నారు.
* పద్మా దేవేందర్‌రెడ్డి స్పష్టీకరణ
* హరీష్‌రావు బుజ్జగింపులతో అయిష్టంగా అంగీకారం
* నేడు నామినేషన్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టడానికి ఎం.పద్మా దేవేందర్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేయడంలేదు. డిప్యూటీ స్పీకర్‌గా ఉంటే రాజకీయంగా నష్టపోతానని, దానికన్నా ఎమ్మెల్యేగా ఉంటేనే మంచిదని పేర్కొంటున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టాలంటూ ఆమెకు శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్‌రావు ద్వారా కేసీఆర్ ఆదేశాలిచ్చారు. ఇందుకు పద్మ అంగీకరించలేదు. దీంతో మంగళవారం ఉదయం మంత్రుల చాంబర్‌లో ఆమెతో హరీష్‌రావు సమావేశమయ్యారు.
పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా పద్మను బుజ్జగించారు. ‘‘డిప్యూటీ స్పీకర్ హోదాలో మంత్రుల కార్యాలయాలకు వెళ్లలేం. నియోజకవర్గ అభివృద్ధి కోసం సచివాలయానికి, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుంటే పనులు కావు. డిప్యూటీ స్పీకర్‌గా ఉండి కార్యాలయం, బుగ్గకారు, అటెండర్‌తో సంతోషపడటానికేనా ఎమ్మెల్యే అయింది? నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేకుంటే ఎమ్మెల్యేగా నా నియోజకవర్గ ప్రజలకు దూరమవుతా. డిప్యూటీ స్పీకర్ పదవి వల్ల రాజకీయంగా నష్టమే. దానికంటే ఎమ్మెల్యేగా ఉండటమే మంచిది’’ అని పద్మా దేవేందర్‌రెడ్డి తెగేసి చెప్పారు. ‘‘నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి వంటివేమీ ఉన్నా సిద్దిపేటను చూసుకున్నట్టుగానే మెదక్ నియోజకవర్గాన్ని కూడా చూసుకుంటా. న్యాయశాస్త్రంలో పట్టా ఉన్నందున సభా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించగలరని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో విస్తరణకు అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా అవకాశం వస్తుంది’’ అని హరీష్‌రావు బుజ్జగించారు. దీంతో అయిష్టంగానే ఆ పదవి చేపట్టడానికి ఆమె అంగీకరించారు. బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
రెండో ఎమ్మెల్సీ ఎస్సీలకు...?
గవర్నర్ కోటాలోని రెండో ఎమ్మెల్సీని ఎస్సీలకు ఇవ్వాలని సీఎం కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించారు. ప్రస్తుతం గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకుండానే మంత్రివర్గంలో అవకాశం పొందిన నాయిని నర్సింహారెడ్డికి ఒక ఎమ్మెల్సీ అనివార్యంగానే ఇవ్వాల్సి ఉంది. ఇక రెండో ఎమ్మెల్సీ కోసం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన ముఖ్య నాయకులు చాలా మంది పోటీపడుతున్నారు. సామాజికవర్గాల సమతూకం కోసం ఒకటి.. ‘రెడ్డి’ సామాజికవర్గానికి ఇస్తుండటంతో రెండోదాన్ని ఎస్సీలకు ఇవ్వాలని కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడే ఉంటాడన్న కేసీఆర్ ప్రకటనను ఉదహరిస్తూ మందకృష్ణ చేస్తున్న దాడితో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎస్సీలకు అవకాశం ఇవ్వలేకుంటే ఎస్టీలకు ఇచ్చే ప్రతిపాదన కూడా కేసీఆర్ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది.