‘నేను మోసపోయాను’ | i was cheated by unknown person | Sakshi
Sakshi News home page

‘నేను మోసపోయాను’

Published Sat, Nov 15 2014 12:29 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

i was cheated by unknown person

ఘట్‌కేసర్: రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడిన తల్లిదండ్రులతో పాటు చిన్నారి వివరాలు లభ్యమయ్యాయి. మండల పరిధిలోని మాధవరెడ్డి ఫ్లైఓవర్‌బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్‌పై భార్యాభర్తలతో పాటు ఓ చిన్నారి మృతదేహం గురువారం లభ్యమైన విషయం తెలిసిందే. మృతులు రాజస్థాన్‌వాసులు. ‘నేను మోసపోయాను.. తప్పుచేశాను. మాలాగా మరెవరూ మోసపోవద్దు’ అని మృతుడు సజ్జారాం(35) సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

 పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రం పాలీ జిల్లా సిరియాళీ ఠాణా పరిధిలోని నెమ్లీమండ్ గ్రామానికి చెందిన సజ్జారాం(35), చెంప(30), దంపతులకు కూతురు భావన(4) ఉంది. వీరు కొన్నేళ్ల క్రితం నగరంలోని నాచారానికి వలస వచ్చారు. సజ్జారం బంధువైన భవర్‌లాల్ కిరాణ దుకాణంలో పనిచేస్తుండేవాడు. భవర్‌లాల్ సాయంతో ఆయన నాలుగేళ్ల క్రితం మండలంలోని కొండాపూర్‌లో కిరాణ దుకాణం ప్రారంభించాడు. దుకాణం వెనుక గదిలో భార్యాపిల్లలతో ఉండేవాడు.

స్థానికంగా హోటల్ నడిపే శ్రీరాములుతో సజ్జారాంకు పరిచయం ఏర్పడింది. శ్రీరాములు కొండాపూర్‌కు వలస వచ్చిన రవి అనే వ్యక్తిని సజ్జారాంకు పరిచయం చేశాడు. రవి హుందాగా ఉండేవాడు. సజ్జారాంకు అతడితో స్నేహం ఏర్పడింది. ఇదే అదనుగా భావించిన రవి తనకు శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులతో మంచి సం బంధాలున్నాయని అతడిని నమ్మించాడు. తక్కువ డబ్బులకు స్టాంపు డ్యూటీ, ఇతరపన్నులు లేకుండా బంగారం దొరుకుతుందని రవి సజ్జారాంకు చెప్పాడు.

దీంతో సజ్జారాం అతడికి కొంత సొమ్ము ఇవ్వడంతో బంగారం తెచ్చి ఇచ్చాడు. దీంతో సజ్జారాంకు రవిని పూర్తిగా విశ్వసించాడు. ఇదే అదనుగా భావించిన రవి, సజ్జారాం నుంచి పెద్ద మొత్తంలో డబ్బు గుంజేందుకు పథకం పన్నాడు. బంగారం ఇంకా తీసుకొస్తానని చెప్పి అతడు రెండు నెలల కాలంలో సజ్జారాం నుంచి రూ.15 లక్షలు తీసుకున్నాడు. బంగారం కోసం సజ్జారాం రవిని అడిగితే రేపుమాపు అని తిప్పుతున్నాడు. ఇదిలా ఉండగా షిర్డీలోని తనకు పరిచయం ఉన్న ఓ వ్యక్తి బంగారం ఇస్తాడని చెప్పడంతో సజ్జారాం ఈనెల 7న కుటుంబీకులతో పాటు తన మిత్రుడు శ్రీరాములును తీసుకొని అక్కడికి వెళ్లాడు.

రవి చెప్పిన వ్యక్తి గురించి షిర్డీలో వాకబు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈలోగా రవి సెల్ స్విచాఫ్ చేశాడు. దీంతో నిరాశ  చెందిన వారు 10 తేదిన కొండాపూర్ చేరుకున్నారు. అంతకు ముందేరవి తన అద్దెగదిని ఖాళీ చేసి వెళ్లాడు. దీంతో మోసపోయానని గుర్తించిన సజ్జారాం తీవ్ర మనస్తాపం చెందాడు. గురువారం ఆయన దుకాణం తీయలేదు. ఉదయం భార్య చెంప, కూతురు భావనను తీసుకొని బైక్‌పై వెళ్లాడు. అదే రోజు మధ్యాహ్నం ఘట్‌కేసర్ సమీపంలోని మాధవరెడ్డి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రైల్వేట్రాక్‌పై రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి మృతదేహాలను గుర్తించడానికి వీలులేకుండా పోయింది.

 మృతుల వివరాలు తెలిశాయి ఇలా..
 సజ్జారాం ఫోన్ మూడు రోజులుగా స్విఛాఫ్ వస్తుం దని అతడి తల్లిదండ్రులు రాజస్థాన్ నుంచి భవర్‌లాల్‌కు ఫోన్ చేసి చెప్పారు. దీంతో భవర్‌లాల్ శుక్రవారం ఉదయం కొండాపూర్  చేరుకున్నాడు. సజ్జారాం అద్దె ఇంటికి, దుకాణానికి తాళం వేసి ఉందని గుర్తించి శ్రీరాములు వద్దకు వెళ్లాడు. సజ్జారాం విషయం తనకు తెలియదని అతడు చెప్పాడు. దీంతో భవర్‌లాల్ పీఎస్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానించిన పోలీసులు రైల్వే ట్రాక్‌పై దొరికిన మృతదేహాలను ఓసారి పరిశీలించాలని కోరుతూ భవర్‌లాల్‌ను గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మార్చురీలోని మృతదేహాలను చూసి భవర్‌లాల్.. మృతులు సజ్జారాం, చెంప, భావనగా గుర్తించాడు.  

 ‘నాలాగా మరెవరూ మోసపోవద్దు..’
 రైల్వే పోలీసులు శుక్రవారం సాయంత్రం కొండాపూర్‌కు వచ్చి స్థానిక పోలీసుల సాయంతో  సజ్జారాం ఇంటి తాళాలు విరగ్గొట్టి పరిశీలించారు. రవి రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘నేను మోసపోయాను.. తప్పుచేశాను. నాలాగా మరెవరూ మోసపోవద్దు, అత్యాశకు పోయి రవికి బంగారం కోసం రూ.15 లక్షలు ఇచ్చాను’ అని హిందీభాషలో సజ్జారాం రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుకాణంలో మిగిలి ఉన్న సామగ్రిని తన సోదరుడికి అప్పగించాలని సజ్జారాం తన సూసైడ్ నోట్‌లో కోరాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement