కాంగ్రెస్‌లోనే ఉంటా: జయసుధ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరించేందుకు సిద్ధమని సికిం ద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, సినీనటి జయసుధ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌లో జయసుధ చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆమె తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లి సుమారు గంటకుపైగా ఆయన తో భేటీ అయ్యారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ నేతల నుంచి వస్తున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై మాట్లాడారు. భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీదే అధికారమని, అప్పుడు ఉన్నతమైన అవకాశాలు ఉంటాయని జయసుధకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నచ్చజెప్పారు. జయసుధ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టుగా సోమవారం వార్తలు రావడంతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత కె.జానారెడ్డి తదితరులు వెంటనే ఆమెతో మాట్లాడిన సంగతి తెలిసిందే. పార్టీని వీడి వెళ్లాల్సిన అవసరం లేదని, భవిష్యత్‌లో మంచి అవకాశాలు ఉంటాయని వారు నచ్చజెప్పారు.
జయసుధ కాంగ్రెస్‌తోనే ఉంటారు: ఉత్తమ్
కాంగ్రెస్ పార్టీతోనే జయసుధ ఉంటారని, ఆమె పార్టీని వీడతారనే ప్రచారమంతా తప్పు అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. జయసుధతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడు తూ కాంగ్రెస్ అధిష్టానంతోనూ జయసుధకు దగ్గరి సంబంధాలున్నాయన్నారు. కాంగ్రెస్‌ని వీడాల్సిన అవసరం జయసుధకు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో తనకు సుదీర్ఘ అనుబంధం ఉం దని, పార్టీలో ఏ బాధ్యత ఇచ్చినా చిత్తశుద్ధితో పనిచేస్తానని జయసుధ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టుగా జరిగిన ప్రచారాన్ని ఆమె ఖండించారు. రెండు రాష్ట్రాల్లో ఏ బాధ్యతను అప్పగించినా స్వీకరించేందుకు తాను సిద్ధమని చెప్పారు.