నిశ్చితార్థం సందర్భంగా బంధువులతో అమ్రపాలి, సమీర్‌శర్మ
సాక్షి, వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాట, డామన్ ఎస్పీ సమీర్‌శర్మతో కలిసి ఏడడుగులు వేయనున్నారు. నేడు (ఆదివారం) సమీర్‌శర్మ, అమ్రపాలిల వివాహం జమ్మూలో జరగనుంది. ఐఏఎస్ అధికారిణి అమ్రపాలి నిశ్చితార్థం, ఐపీఎస్ ఆఫీసర్ సమీర్‌శర్మతో జమ్మూకాశ్మీర్‌లో శనివారం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. బంధువులు, కొందరు సన్నిహితుల సమక్షంలో వైభవంగా ఈ వేడుక నిర్వహించారు.
అమ్రపాలి 2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ కాగా, సమీర్ శర్మ 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించారు. నేడు వివాహ బంధంతో ఒక్కటవనున్నారు. ఇప్పటికే వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి వివాహ నేపథ్యంలో సెలవులో వెళ్లారు. వివాహం అనంతరం ఈ నెల 22న వరంగల్‌లో, 25 న హైదరాబాద్‌లో అమ్రపాలి తన సన్నిహితులకు విందు ఇవ్వనున్న విషయం తెలిసిందే. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత 26 నుంచి మార్చి 7 వరకు భర్త సమీర్‌తో కలిసి ఆమ్రపాలి టర్కీ పర్యటన వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
ఆమ్రపాలి తండ్రి విశాఖపట్నానికి చెందిన కాట వెంకటరెడ్డి. ఆయన ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆమ్రపాలి ఐఐటీ మద్రాస్ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం బెంగళూరు ఐఐఎం నుంచి పీజీ డిప్లొమా పట్టా అందుకున్నారు. ఐఏఎస్ కాకముందు జూనియర్ రిలేషన్‌షిప్ బ్యాంకర్‌గా పని చేశారు. 2010లో సివిల్స్ రాసి 39వ ర్యాంక్ సాధించారు. మంచి ర్యాంక్ రావడంతో సొంత రాష్ట్ర కేడర్‌లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు.
సోదరితో వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి
2014లో వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి అనంతరం మహిళా శిశు సంక్షేమ విభాగానికి మారారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత వరంగల్ అర్బన్ కలెక్టర్‌గా ఆమ్రపాలి 2016 అక్టోబరు 11న బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి పాలనలో తనదైన ముద్ర వేస్తూ వరంగల్‌ను ఓడీఎఫ్( ఓపెన్ డిఫెక్షన్ ఫ్రీ)గా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. కేంద్రం నుంచి పలు అవార్డులు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment