బుధవారం ఢిల్లీలో నిర్మలా సీతారామన్‌కి పుష్పగుచ్ఛం అందిస్తున్న ఎంపీ కవిత
- కేంద్రంలో చేరికపై ఎంపీ కవిత వ్యాఖ్య
న్యూఢిల్లీ: బీజేపీ ఆహ్వానిస్తే కేంద్రలో చేరడంపై తమ పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత అన్నారు. తాము కేంద్రంలో చేరుతామన్న వార్తలు కేవలం ఊహాగానాలే అని, ఇప్పుడే దీనిపై మాట్లాడడం సరికాదని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీలో బుధవారం కేంద్ర మంత్రులు చౌదరి బీరేంద్రసింగ్, నిర్మలా సీతారామన్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు.
నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేసినట్లు కవిత చెప్పారు. అయితే పసుపు బోర్డు ఏర్పాటుకు కొంత సమయం పడుతుందని, ఈ లోపు నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల పార్క్‌ను ఏర్పాటు చేస్తామని సీతారామన్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలు వెనుకబడినవని, వీటి అభివృద్ధికి నిధులు కేటాయించాలని బీరేంద్రసింగ్‌ను కోరానని, వీలైనంత నిధులు కేటాయించేందుకు ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు.