సాక్షిప్రతినిధి, నిజామాబాద్: పగలు, రాత్రీ తేడా లేకుండా మొరం తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. చీకటి పడితే చాలు జేసీబీలు షురూ అవుతున్నాయి. రాత్రంతా తవ్వకాలు, టిప్పర్లలో తరలింపు జరుగుతోంది. నిత్యం వందల సంఖ్యలో టిప్పర్లలో మొరాన్ని నిజామాబాద్ నగరానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో టిప్పరుకు రూ.రెండు వేల నుంచి రూ.2,500 వరకు వసూలు చేస్తున్నారు. నగరంలో రియల్ వెంచర్లకు, కట్టడాలకు, రోడ్ల పనులకు, ఇతర అవసరాలకు సరఫరా చేస్తూ కాసులు దండుకుంటున్నారు.
చేతులెత్తేసిన గనుల శాఖ
అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన భూగర్భ గనుల శాఖ సిబ్బంది కొరత పేరుతో చేతులెత్తేసింది. కార్యాలయంలో ఉన్నది కేవలం ముగ్గురే ఉద్యోగులని, ఉన్న ఉద్యోగులు కార్యాలయం విధులకే సరిపోవడం లేదని.. క్షేత్ర స్థాయి తనిఖీలు ఎలా చేపట్టేదని వారు పేర్కొంటున్నారు. సిబ్బంది, యంత్రాంగం ఉన్న రెవెన్యూ శాఖ గానీ, పొలీసుశాఖ గానీ ఈ తవ్వకాలను, అక్రమ రవాణాను అడ్డుకోవాలని వారు చెబుతున్నారు. ఇలా ఒకరంటే.. మరొకరు బా«ధ్యతను బదలాయించుకునేలా చేస్తుండటంతో మొరం మాఫియా తమ దందాను యథేచ్ఛగా కానిచ్చేస్తోంది.
అధికార పార్టీ అండదండలు..
మొరం మాఫియాకు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలుండటంతో ఈ అక్రమ దందాను అడ్డుకునే నాథుడే లేకుండా పోయారు. కళ్ల ముందే తవ్వకాలు, రవాణా జరుగుతున్నా రెవెన్యూ, పోలీసుశాఖల అధికారులు ఈ అక్రమ రవాణా వైపు కన్నెత్తి కూడా చూసే పరిస్థితి లేకుండాపోయింది.
అధికారులేమంటున్నారంటే..
అక్రమ తవ్వకాలపై భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.సత్యనారాయణను ‘సాక్షి’ సంప్రదించగా., తమశాఖలో సిబ్బంది కొరత తీవ్రం గా ఉందని చెప్పారు. దీంతో తాము క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసేందుకు వీలు పడటం లేదని చెప్పారు. అక్రమ తవ్వకాలు, రవాణాను అడ్డుకునేందుకు అధికారాలు రెవెన్యూ, పోలీసు శాఖలకు డెలిగేషన్ అయ్యాయన్నా రు. వారు చూసుకోవాలన్నారు. నిజామాబాద్ ఆర్డీఓ వినోద్‌కుమార్‌ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేయగా ఆయన స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment