వెతలు పట్టేదెవరికి! | implementation of the minimum wage law | Sakshi
Sakshi News home page

వెతలు పట్టేదెవరికి!

Published Sun, May 31 2015 2:17 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

implementation of the minimum wage law

దుర్భరంగా ‘సఫాయి’ బతుకులు
ఈఎస్‌ఐ డబ్బులు కట్...అయినా అందని వైద్యం
అమలు కాని కనీస వేతన చట్టం

 
సంగారెడ్డి మున్సిపాలిటీ: ‘స్వచ్ఛ భారత్- స్వచ్ఛ తెలంగాణ’ ఇప్పుడివి సెలబ్రిటీ పదాలు. పీఏం మోదీ, సీఎం కేసీఆర్... స్వయంగా చీపురు పట్టి ఊడ్చేస్తున్నారు. కాలనీలు పరిశుభ్రంగా ఉంచుకుందాం అనే నినాదంతో దూసుకుపోతున్నారు. కానీ... సఫాయి కర్మచారుల కష్టం తెలిసిందెందరికి! వారి బాధలు పట్టిందెవరికి! తెలంగాణ తొలి అవతరణ ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ ‘సాక్షి’ వారి జీవితాల్లోకి తొంగి చూసింది. సూర్యుని కంటే ముందే నిద్ర లేచి... పట్టణాన్ని శుభ్రం చేసే వారి ఇళ్లల్లో ఇంకా వెలుగులు చిమ్మలేదు. అర్థాకలి, జబ్బులతోనే జీవితాన్ని నెట్టుకొస్తున్న దయనీయ స్థితి వారిది...
 
జిల్లా వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాల చట్టాలు వర్తించడం లేదు. ఇందుకు అధికారులు... కాంట్రాక్టకు తొత్తులుగా మారడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. కనీస వేతన చట్టం ప్రకారం రూ.7,300 ఇవ్వాలి. కానీ రూ.6,300 మాత్రమే చెల్లిస్తూ వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపాలిటీలో 115 మంది కాంట్రాక్ట్, 44 మంది రెగ్యులర్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో జిల్లా కలెక్టర్‌తో పాటు జేసీ, మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్ నివాసాలలో విధులు నిర్వర్తిస్తున్నవారూ ఉన్నారు.
 
 అందని సాయం...
 కార్మికులకు కనీస వేతనం ఇవ్వకపోవడమే కాదు... వారికి అందాల్సిన సదుపాయాలను సైతం దూరం చేస్తున్నారు. వీరి వేతనంలో నుంచి ఈఎస్‌ఐ, పీఎఫ్ కోసం కొంత మొత్తం కట్ అయితే అవుతుంది గానీ... అవి వారి అక్కౌంట్లలో జమ అవ్వడం లేదు. ఫలితంగా... విధిగా నెలనెలా డబ్బు చెల్లిస్తున్నా ఈఎస్‌ఈ కార్డు పనిచేయడం లేదు. అనారోగ్యం పాలయినప్పుడు ఈ కార్డు ఉపయోగపడక... ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖర్చులు భరించలేక... ప్రభుత్వ ఆసుపత్రులనే ఆశ్రయించాల్సి వస్తోంది. ఒక ఏడాదిలోనే వివిధ కారణాలతో ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. కానీ ఏ ఒక్కరికీ పరిహారం కానీ, ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం గానీ అందలేదు.
 
 సీఎం ఇలాఖాలోనూ...
 ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నగర పంచాయతీలో 130 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడ కూడా... కార్మికుల పీఎఫ్ సొమ్ము ఇంత వరకు వారి ఖాతాలో జమ చేయలేదు. వేతనంలో రూ.7,100 మాత్రమే కార్మికులకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నగర పంచాయతీలో 101 మంది కాంట్రాక్ట్ కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు.
 
 మెదక్‌లో...
 మెదక్ మున్సిపాల్టీలో 115 మంది పారిశుధ్య కార్మికులున్నారు. వీరికి కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు, కాంట్రాక్టర్లు విఫలమయ్యారు. ఈఎస్‌ఐ, పీఎఫ్ కార్డులున్నా ప్రయోజనం లేకుండా పోయిందని కార్మికులు ఆరోపిస్తున్నారు.
 
 జహీరాబాద్‌లో...
 జహీరాబాద్ మున్సిపాలిటీలో 99 మంది కాంట్రాక్ట్ కార్మికులతో పాటు 33 మంది రెగ్యులర్ కార్మికులున్నారు. కానీ వీరికి వేతనం రూ.7,300కు గానూ రూ.6,900 మాత్రమే చెల్లిస్తున్నారు. ఈఎస్‌ఐ, పీఎఫ్ పేరిట వేతనంలో కోతలు పెట్టినా... ఖాతాల్లో జమ కావడం లేదు.
 
 సదాశివపేటలో...
 సదాశివపేట మున్సిపాలిటీలో 108 మంది కాంట్రాక్ట్ కార్మికులున్నారు. ఇక్కడా అదే పరిస్థితి. నిబంధనల ప్రకారం వేతనం కార్మికులకు అందడం లేదు.
 
 జోగిపేటలో...
 జోగిపేట నగర పంచాయతీలో 73 మంది కాంట్రాక్ట్ కార్మికులున్నారు. ఇక్కడా కనీస వేతనాల్లో కొంత మొత్తం కోత వేస్తున్నారు. మొత్తంగా జిల్లాలోని 4 మున్సిపాలిటీలతో పాటు 2 నగర పంచాయతీలలో కనీస వేతనాల చట్టంతో పాటు కార్మికులకు సబ్బులు, నూనెలు, బ్లౌజ్‌లు ఏటా అందించాల్సి ఉన్నా ఎక్కడా ఆ ఊసే లేదు.
 
 వారి పాపం... వీరికి శాపం

 మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా వైద్యం పొందే అర్హతను కార్మికులు కోల్పోతున్నారు. నెలనెలా కార్మికులు ఈఎస్‌ఐ చెల్లిస్తున్నా... అది సంబంధిత ఖాతాల్లోకి వెళ్లకపోవడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. ఉదాహరణకు సంగారెడ్డి మున్సిపాలిటీలోని 115 మంది కాంట్రాక్టు కార్మికులు ఒక్కోరు నెలకు రూ.125 చొప్పున ఈఎస్‌ఐ కింద చెల్లిస్తున్నారు. కానీ... ఈ ఒక్క ప్రాంతం నుంచే రెండేళ్లుగా ఆ శాఖకు సుమారు రూ.10 లక్షలు బకాయి ఉంది. ఇక మిగిలిన ప్రాంతాలు కూడా లెక్కిస్తే... కార్మికులను కాంట్రాక్టర్లు, అధికారులు ఎంతగా దోచుకుంటున్నారో అర్థమవుతుంది. పోరాడి సాధించుకున్న హక్కును అధికారులు.. కార్మికులను అందకుండా చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈఎస్‌ఐ బాకాయిలను చెల్లించాలని కార్మికులు కోరుతున్నారు.
 
 వైద్యం అందడం లేదు - కార్మికుడు రాజు
 విధి నిర్వహణలో భాగంగా రాజీవ్ పార్క్‌లో పనిచేస్తున్న క్రమంలో గాజు సీసా ముక్క కాలుకు గుచ్చుకుంది. దీంతో ఇన్‌ఫెక్షన్ సోకి కాలంతా వాపు వచ్చింది. ఈఎస్‌ఐ కార్డు తీసుకుని ఆసుపత్రికి వెళ్లాను. అక్కడ డాక్టర్లు కార్డు పనిచేయదన్నారు. చేసేది లేక వెనక్కి వచ్చా. ఈ విషయంపై కమిషనర్‌ను అడిగితే... తాను డబ్బులు చెల్లించినా ఎందుకు వైద్యం చేయడం లేదో తెలియడం లేదంటూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఈఎస్‌ఐ అధికారులకు తెలుపగా మున్సిపల్ నుంచి ఈఎస్‌ఐ ఖాతాలో డబ్బులు జమ చేయని కారణంగా మా కార్డులు పనిచేయడం లేదని తెలిపారు. ఏది ఏమైనా మాకైతే వైద్యం దక్కడం లేదు.
 
 రెండు నెలలుగా తిరుగుతున్న  - కార్మికుడు శ్రీనివాస్
 మున్సిపల్‌లో ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్నా. రెండు నెలల క్రితం కాలుకు ఇన్‌ఫెక్షన్ వచ్చింది. వైద్యం కోసం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాను. మీ కార్డులు చెల్లవంటూ అక్కడి వైద్యులు చెప్పారు. ఎందుకు చెల్లవని అడిగితే... ఈ కార్డులపై డబ్బులు చెల్లించలేదని సమాధానమిచ్చారు.
 
 స్వచ్ఛ తెలంగాణ భారం
 ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం భారం కార్మికులపైనే పడుతోంది. అధికారులు ప్రజలను భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసి ఉంది. కానీ అధికారులు మాత్రం... మున్సిపల్ కార్మికులను ఒకే వార్డులోకి తీసుకెళ్లి పనిచేయిస్తున్నారు. ఫలితంగా ఈ కార్యక్రమంతో పనిభారం పెరిగిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement