స్వైన్‌ఫ్లూ...భయం | improving swine flue cases creat tension | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూ...భయం

Published Mon, Jan 12 2015 12:12 PM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

improving swine flue cases creat tension

నల్లగొండ టౌన్: ప్రజలకు స్వైన్‌ఫ్లూ భయం పట్టుకుంది. జిల్లాకు అతిసమీపంలో గల రాజధాని నగరంలో రోజురోజుకూ సైన్‌ఫ్లూ కేసుల సంఖ్య పెరగడమే గాక మరణాలు సంభవిస్తుండడమే ఇందుకు కారణం. ఇప్పటి వరకు జిల్లాలో ఎలాంటి సైన్‌ఫ్లూ కేసులు నమోదు కాలేదు. కానీ హైదరాబాద్‌కు నిత్యం రాకపోకలు సాగించేవారి ద్వారా వ్యాప్తిచెందుతుందో ఏమోనని ఆందోళన చెందుతున్నారు.
 
 చలితీవ్రత ఎక్కువ ఉన్న కాలంలో వైరస్ కారణంగా సైన్‌ఫ్లూవ్యాధి వ్యాప్తి చెందుంతుంది. మనిషి నుంచి మనిషికి గాలి ద్వారా వ్యాధి వ్యాపిస్తుంది. ఇప్పటి వరకు జిల్లాలో స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదు కానప్పటికీ చలికాలంలో వచ్చే జబ్బులతో స్వైన్‌ఫ్లూ వస్తుందేమోనని  ప్రజలు జంకుతున్నారు. జిల్లా వ్యా ప్తంగా మలేరియా,  చికున్‌గున్యా, టైఫాయిడ్ వంటి కేసులతో పాటు చలిజ్వరం, జలుబు, దగ్గు, వంటి నొప్పులతో ప్రతి రోజూ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. దీంతో పాటు జిల్లాలోని పలు ప్రయివేటు ఆస్పత్రులలో వివిధ జబ్బులతో బాధపడుతూ చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోవడంఆందోళన కలిగిస్తోంది. జిల్లాకు అతి సమీపంలోని హైదరాబాద్‌లో రోజు రోజుకూ స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో పాటు మరణాలు కూడా సంభవించడం జిల్లా ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.
 
 జిల్లా కేంద్రంతో పాటు జిల్లా నలుమూలల నుంచి ప్రతి రోజూ హైదరాబాద్‌కు వేలాది మంది ఉద్యోగులు, వ్యాపారస్తులు, రాజకీయనాయకులు, ఇతర వ్యాపకాలతో రాకపోకలు సాగిస్తుంటారు. స్వైన్‌ఫ్లూ వ్యాధి మనిషి నుంచి మనిషికి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు తుంపర్లతో పాటు గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. అందువల్ల నిత్యం రాకపోకలు సాగిస్తున్నవారి ద్వారా జిల్లాకు వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ప్రజలు జంకుతున్నారు. చలితీ వ్రత ఎక్కువ ఉన్నందున అనేక మంది జలుబు,దగ్గుతో బాధపడుతున్నారు. జలుబు,దగ్గు,జ్వరం వంటి లక్షణాలు ఉండడంతో తమ కు సైన్‌ఫ్లూ వచ్చిందేమోననే ఆందోళనతో చా లా మంది ప్రజలు ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు.
 
 వ్యాధి లక్షణాలు..
 
 దగ్గు, జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, విరేచనాలు, గొంతునొప్పి, తలనొప్పి, శ్వాస తీసుకోలేకపోవడం వంటివి స్వైన్‌ఫ్లూ లక్షణాలు.
 
 నివారణ..

 చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఎక్కువ ద్రవపదార్థాలు తీసుకోవాలి.  స్వైన్‌ఫ్లూ వ్యాధి గ్రస్తులకు దూరంగా ఉండాలి. నోటికి, ముక్కుకు మాస్క్‌లను ధరించాలి. ఆరోగ్యంగా ఉండేటట్లు చూసుకోవాలి. సంపూర్ణ విశ్రాంతి తీసుకోవాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటికి, ముక్కుకు అడ్డంగా చేతిరుమాలు పెట్టుకోవాలి.  వ్యాధి లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స పొందాలి.
 
 
 
 ముందస్తుగా 10 పడకల ప్రత్యేక వార్డు ఏర్పాటు

 స్వైన్‌ఫ్లూ వ్యాధి హైదరాబాద్ తీవ్రమవడంతో సమీపంలో ఉన్న మన జిల్లాకు వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ఇక్కడి యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంది. ఇప్పటి వరకు కేసులు ఏమీ లేనప్పటికీ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో 10 పడకల ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. స్వైన్‌ప్లూ వ్యాధి నిర్ధారణ కోసం పరీక్షలను నిర్వహించడానికి అవసరమైన కిట్‌లను అందుబాటులో ఉంచారు. వ్యాధి సోకిన వారికి చికిత్సలకు అవసరమైన అన్ని రకాల ట్యాబ్లెట్‌లను, టానిక్‌లతో పాటు ఇతర మందులను ఆస్పత్రిలో సిద్ధంగా ఉంచారు. అదే విధంగా వ్యాధి లక్షణాలను గుర్తించడానికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులకు, సిబ్బందికి  అవసరమైన అవగాహన కల్పించారు.
 
 ఆందోళన అవసరం లేదు
 స్వైన్‌ఫ్లూ కేసులు జిల్లాలో నమోదు కాలేదు. దాని గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైన మందులను సిద్ధంగా ఉంచాం. ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశాం. అనుమానం ఉన్నట్లు అయితే వెంటనే జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని వైద్యులను సంప్రదించాలి.   
 డాక్టర్ పి.ఆమోస్, డీఎంహెచ్‌ఓ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement