వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది...
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆడుతూ పాడుతూ శోభాయాత్రలో పాల్గొన్న ముగ్గురిని మృత్యువు కబళించింది. డీజే పాటల కోసం విద్యుత్ తీగలు అమర్చే క్రమంలో షాక్ తగిలి.. ఆటోలో కూర్చున్న మడావి కాశీరామ్(45), రజినీకాంత్(15), గేడం సంతోష్(27) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇదే ఘటనలో మరొకరికి గాయాలయ్యాయి. ఇంద్రవెల్లి మండలం పిప్రిలో బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన మూడు గ్రామాల్లో విషాదం మిగిల్చింది. జైనథ్ మండలం బాలాపూర్ గ్రామానికి చెందిన రౌత్ గజానన్(18) వినాయక నిమజ్జనం అనంతరం పెండల్‌వాడ వాగులో గల్లంతయ్యాడు. గ్రామస్తులు మూడు గంటలపాటు గాలించగా మృతదేహం లభించింది.
- గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి
- వేర్వేరు చోట్ల నలుగురు దుర్మరణం
- విద్యుదాఘాతంతో ముగ్గురు..
- వాగులో గల్లంతై డిగ్రీ విద్యార్థి..
- మరొకరికి గాయాలు
ఇంద్రవెల్లి : వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. నిమజ్జనానికి వెళ్లిన ముగ్గురిని విద్యుత్ తీగల రూపంలో మృత్యువు కబళించింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో మండలంలోని పిప్రి గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటన మూడు గ్రామాల్లో విషాదం మిగిల్చింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని లక్కుగూడ గ్రామస్తులు గణేష్ ప్రతిమను ఏర్పాటు చేసి ఏడు రోజులు పూజలు నిర్వహించారు. బుధవారం నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో గణేష్ ప్రతిమ ఊరేగింపు నిర్వహించారు. ముత్నూర్ త్రివేణి సంగం ప్రాజెక్టులో నిమజ్జనం చేసేందుకు వెళ్తుండగా.. మార్గమధ్యంలోని పిప్రి గ్రామంలో ఆటోలో అమర్చిన డీజే కోసం కోండిల(విద్యుత్ వైర్లు) ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పిస్తుండగా ఆటో మొత్తానికి కరెంటు సరఫరా జరిగింది.
దీంతో ఆటోలో ఉన్న చిలటిగూడ గ్రామానికి చెందిన మడావి కాశీరామ్(45), పిప్రి గ్రామానికి చెందిన కోడప గంగారాం, మొతుబాయి దంపతుల కుమారుడు రజినీకాంత్(15), మండలంలోని తేజాపూర్ గ్రామ పంచాయతీ పరిధి మల్లపూర్‌కు చెందిన గేడం సంతోష్(27) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మల్లపూర్ గ్రామానికి చెందిన డీజే ఆపరేటర్ దుర్వ అనిల్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే మండల కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించంగా చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై రమేష్‌కుమార్ పిప్రి, లక్కుగూడ గ్రామాలను సందర్శించి సంఘటనకు గల కారణాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు
విద్యుతాఘాతంతో ముగ్గురు మృత్యువాతపడడంతో మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. చిలటిగూడ గ్రామానికి చెందిన మడావి కాశీరామ్‌కు భార్య దుర్పతబాయి, నలుగురు కూతుళ్లు, ముగ్గురు కుమారులు ఉన్నారు. గేడం సంతోష్‌కు భార్య వనజ, కుమారుడు నాగరాజ్(2) ఉన్నారు. వనజ ఐదు నెలల గర్భిణి. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.