స్వతంత్రుల ప్రభావం ఎంత... | Independent Candidates Problems In Warangal | Sakshi
Sakshi News home page

స్వతంత్రుల ప్రభావం ఎంత...

Published Mon, Nov 26 2018 10:36 AM | Last Updated on Mon, Nov 26 2018 10:38 AM

Independent Candidates Problems In Warangal - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తికావటంతో ఇప్పుడు అందరికీ స్వతంత్ర అభ్యర్థుల గండం పట్టుకుంది. స్వతంత్రులకు పడే ఓట్లు ఎవరి గెలుపోటములపై ప్రభావం చూపుతాయోనని జంకుతున్నారు. దీనిపై ప్రధాన పార్టీల నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. మానుకోట నియోజకవర్గంలో నలుగురు అభ్యర్థుల మధ్య పోటీ ఉండగా, డోర్నకల్‌ నియోజకవర్గంలో ద్విముఖ పోటీ నెలకొంది. అయితే గత ఎన్నికల్లో 10మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగగా, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో 12 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. ఈ సారి స్వతంత్రులు ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపనున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈవీఎంలో నోటాతో పాటు 16మంది అభ్యర్థులు దాటితే కొత్తగా మరో ఈవీఎం అమర్చాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మానుకోట, డోర్నకల్‌ నియోజకవర్గాల్లో లేకపోయినప్పటికీ వీరికి పోలయ్యే ఓట్లు ఎవరికి నష్టం చేకూరూస్తాయోనన్న భయం అభ్యర్థులకు పట్టుకుంది.

వీరి ప్రభావం ఎంత...
మానుకోట నియోజకవర్గంలో జరిగిన 2014 ఎన్నికల్లో 13 మంది అభ్యర్థులు పోటీచేయగా, అందులో 7గురు ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా పోటీ చేశారు. వీరిలో 10 మంది అభ్యర్థులకు డిపాజిట్‌లు గల్లంతైనాయి. కానీ వీరు పోలైన ఓట్లలో సుమారు 3 శాతం ఓట్లను సాధించారు. డోర్నకల్‌ నియోజకవర్గంలో మొత్తం 9 మంది అభ్యర్థులు పోటీ చేయగా ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా ముగ్గురు అభ్యర్థులు పోటీ పడగా వీరికి సుమారు 4శాతం ఓట్లు పడ్డాయి. గెలిచిన అభ్యర్థులకు ఓడిన అభ్యర్థులకు మధ్య తేడా కూడా అన్నే ఓట్ల శాతం ఉండటంతో వీరి పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గుర్తులతో ఇబ్బందే..
ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు, ప్రధాన పార్టీ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను పోలి ఉన్న సందర్భంలో క్రాస్‌ ఓటింగ్‌ జరిగే అవకాశం ఉంటుంది. వృద్ధులకు సరిగా గుర్తులు కనిపించక ఓట్లు క్రాసింగ్‌ పడే ప్రమాదం ఉందని ప్రధాన పార్టీల అభ్యర్థులు జంకుతున్నారు. మరో వైపు పోటీలో ఉన్న అభ్యర్థులు, వారు ఏ ప్రాంతాల్లో, ఏ సామాజిక వర్గాల ఓట్లును కొల్లగొట్టనున్నారోనని అన్ని పార్టీలు లెక్కలు కడుతున్నాయి. ఫలానా అభ్యర్థి ఫలానా ప్రాంతంకు చెందిన వాడు. దీంతో ఎదుటి పార్టీ ఓట్లు చీలే అవకాశం ఉందనే భావనలో ప్రస్తుతం అన్ని పార్టీల నాయకులు ఆలోచిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement