‘సమాచార’ బాధ్యతలు రమణారెడ్డికి
దానకిషోర్ బీసీ సంక్షేమ శాఖకు బదిలీ
మీడియా లైజనింగ్ ఆఫీసర్ల ఫైలు పెండింగే బదిలీకి కారణం!
దానకిషోర్‌ను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన కేంద్రం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ కమిషనర్ బాధ్యతలను ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ (ప్రొటోకాల్) ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న ఎన్.వి.రమాణారెడ్డికి ప్రభుత్వం అప్పగించింది. సమాచార శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎం.దానకిషోర్‌ను బీసీ సంక్షేమశాఖకు బదిలీ చేసింది. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వాణీప్రసాద్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి దానకిషోర్‌కు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దానకిషోర్ బదిలీకి ప్రధాన కారణం విధులకు సరిగా హాజరు కాకపోవడంతో పాటు లోకేశ్‌బాబు సూచించిన వ్యక్తులను మీడియా లైజనింగ్ ఆఫీసర్లగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయకపోవడమేనని చెప్తున్నారు. ఉన్నతాధికారుల పంపిణీలో భాగంగా దానకిషోర్‌ను కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించింది.
అప్పటి నుంచి ఆయన ఏపీ సమాచార శాఖ కమిషనర్ బాధ్యతలను సరిగా నిర్వహించడం లేదని చెప్తున్నారు. ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా కలిసినట్లు ప్రచారం సాగుతోంది.తెలంగాణకు వెళ్లే ముందు ఏపీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదనే భావనలో దానకిషోర్ ఉన్నారని.. అందువల్లనే మీడియా లైజనింగ్ ఆఫీసర్ల నియామక ఫైలును పెండింగ్‌లో ఉంచారని చెప్తున్నారు. ఇక ఐఆర్‌పీఎస్ సర్వీసుకు చెందిన రమణారెడ్డి ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ (ప్రోటోకాల్) ప్రత్యేక కార్యదర్శిగా సమర్ధంగా పనిచేస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే రమాణారెడ్డికి సమాచార శాఖ కమిషనర్‌గా, ఎక్స్ అఫిషియో కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.