
ఏంరోయ్.. దగ్గరకు వస్తున్నావు.. నన్ను ముట్టుకోవద్దన్నానా.. చల్.. అలా జరుగు.. దూరంగా ఉండు.. డోంట్ టచ్.. ఇది మన వాయిస్ కాదు.. ఈ చెట్ల ఇన్నర్ వాయిస్! వీటిపై ఓసారి లుక్కేసుకోండి. విషయం మీకే తెలుస్తుంది.. రేవులో తాటిచెట్టులా అంతెత్తున పెరిగాయి. కానీ ఎక్కడన్నా టచ్ అయ్యాయా? పై భాగంలో ఉన్న వాటి ఆకులు, కొమ్మలు అన్నిటి మధ్య అంతరం ఉంది గమనించారా.. కొన్ని ప్రాంతాల్లో.. కొన్ని రకాల వృక్ష జాతుల్లో.. ముఖ్యంగా ఒకే ఎత్తు ఉన్నవాటిల్లో ఈ చిత్రమైన విషయాన్ని మనం గమనించొచ్చు. కొన్నిసార్లు వేర్వేరు వృక్ష జాతుల్లోనూ ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్ని ‘క్రౌన్ షైనెస్’అంటారు.
ఇలా జరగడం వెనకున్న అసలైన కారణం పూర్తిగా తెలియనప్పటికీ.. తుపానులు లేదా బలమైన గాలులు వీచినప్పుడు ఈ చెట్ల కొమ్మలు ఒకదాన్ని ఒకటి ఢీకొని.. విరిగిపోవడం జరుగుతుందని.. తద్వారా ఆ గ్యాప్ ఏర్పడుతుందని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ తరహా పరిణామం చోటుచేసుకుంటున్న వృక్ష జాతులను పరిశీలిస్తే.. అవి బాగా ఎదిగిన తర్వాతే.. అంటే.. గాలికి ముందుకు వెనక్కు ఊగే స్థాయికి చేరుకున్నప్పుడే ఇలా జరుగుతోందని.. చిన్నగా ఉన్నప్పుడు తొలి దశల్లో ఈ ‘క్రౌన్ షైనెస్’ఉండటం లేదని పేర్కొంటున్నారు.
ఇంక కొంతమందైతే.. ఆకులను తినే లార్వా మరింత ప్రబలకుండా ఉండేందుకు ఆయా చెట్లే సహజసిద్ధంగా తమ విస్తృతిని పరిమితం చేసుకుంటాయని చెబుతున్నారు. ప్రపంచంలో ఇలాంటి వృక్ష జాతులు ఉన్న ప్రాంతాలు చాలా పరిమితంగా ఉన్నాయి. అందులో ఒకటి కౌలాలంపూర్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. ఈ చిత్రం అక్కడిదే. ఈ వృక్షాలు కర్పూరం చెట్లలో ఒక రకానికి చెందినవి. ఇవి ఒకదాన్ని ఒకటి ముట్టుకోవడానికి అస్సలు ఒప్పుకోవట.
– సాక్షి, తెలంగాణ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment