మండలంలోని దిగ్వాల్ బీసీ సంక్షేమ శాఖ వసతి గృహంతో ఆదివారం వండిన అన్నంలో పురుగులు వచ్చాయి. గమనించిన విద్యార్థులు అన్నాన్ని పారబోశారు.
కోహీర్ : మండలంలోని దిగ్వాల్ బీసీ సంక్షేమ శాఖ వసతి గృహంతో ఆదివారం వండిన అన్నంలో పురుగులు వచ్చాయి. గమనించిన విద్యార్థులు అన్నాన్ని పారబోశారు. అన్నంలో పురుగులు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న కొందరు స్థానికులు హాస్టల్ సిబ్బందిని నిలదీశారు. హాస్టల్లో మంచి బియ్యం లేకపోవడంతో అందుబాటులో ఉన్న రవ్వతో ఉప్మా తయారు చేసే ప్రయత్నం చేశారు. అయితే రవ్వలో సైతం పురుగులు కనిపించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించారు. వార్డెన్ వచ్చి బియ్యం తెప్పించి వంట చేయించి ఒంటి గంట ప్రాంతంలో విద్యార్థులకు అన్నం వడ్డించారు. దిగ్వాల్ బీసీ హాస్టల్లో కేవలం 20 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు.
ఉదయం హాస్టల్లో 17 మంది విద్యార్థులు ఉన్నారు. రోజు మాదిరిగా అన్నం, పప్పు వండి వడ్డించారు. అన్నంలో పురుగులు కనిపించడంతో విద్యార్థులు విషయాన్ని సిబ్బందికి తెలిపారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అన్నాన్ని పారవేయించారు. సంక్షేమాధికారి సత్యనారాయణ స్థానికంగా ఉండడం లేదని విద్యార్థులు తెలిపారు. అప్పుడప్పుడు వచ్చి పోతుంటారని హాస్టల్ బాధ్యతలను సిబ్బందే చూసుకొంటారని చెప్పారు.