సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ప్రక్రియ ఫలితాలు వెల్లడించాకే ఎంసెట్–2019 ఫలితాలు ప్రకటిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థులెవరూ ఆందోళనకు గురికావొద్దని విజ్ఞప్తి చేశారు. ఇంటర్ ఫలితాల్లో పెద్ద ఎత్తున తప్పిదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఫెయిలైన విద్యార్థులందరి జవాబు పత్రాలకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రక్రియలకు కొంత సమయం పట్టనుండగా, ఆలోపే ఎంసెట్ ఫలితాలు ప్రకటిస్తే, ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల ఫెయిలైన విద్యార్థులు ఎంసెట్‌లో సైతం ఫెయిల్ కానున్నారు. దీంతో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ తర్వాతే ఎంసెట్ ఫలితాలు ప్రకటించాలని నిర్ణయించినట్లు తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు లింబాద్రి, వి.వెంకటరమణతో కలసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
విద్యార్థులెవరూ ఇంటర్ ఫలితాలపై బెంగ పెట్టుకోకుండా ఎంసెట్‌కు సిద్ధం కావాలని కోరారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ విషయంలో ఇంటర్ బోర్డుతో సమన్వయం చేసుకుని ఎంసెట్ ఫలితాలు ప్రకటిస్తామన్నారు. విద్యార్థులెవరికీ అన్యాయం జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో ఇంజనీరింగ్, 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి ఎంసెట్ ప్రవేశపరీక్ష జరగనుందని, ఆ తర్వాత 28న ఫలితాలు ప్రకటించాలని భావించినట్లు తెలిపారు. అయితే ఇంటర్ ఫలితాల్లో తప్పిదాల కారణంగా ఈ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు చెప్పారు. ఎంసెట్ ఫలితాలు కొద్దిగా ఆలస్యమైనా, కౌన్సెలింగ్‌తో పాటు విద్యా సంవత్సరం అనుకున్న సమయానికి ప్రారంభమవుతుందన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలొచ్చిన తర్వాతే దోస్త్ ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు.
ఇక ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులు
రాష్ట్రంలోని నాలుగు ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలల్లో ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సును 2020–21 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నామని తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. డిగ్రీతో పాటు బీఈడీ చేసేందుకు 5 ఏళ్ల సమయం పట్టనుందని, కానీ ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులో చేరితే నాలుగేళ్లలో డిగ్రీ, బీఈడీ పూర్తి చేయొచ్చన్నారు. నాలుగేళ్ల బీఏ, బీఈడీ/బీకాం, బీఈడీ/ బీఎస్సీ, బీఈడీ కోర్సులను ప్రారంభించాలని యోచిస్తున్నామన్నారు. లక్సెట్టిపేట, కల్వకుర్తి, నారాయణ్‌ఖేడ్, భూపాలపల్లిలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలల్లో తొలుత ఈ కోర్సు ప్రారంభం కానుందన్నారు. ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు సాధారణ డిగ్రీతో సమానమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment