గోదావరి జలాల తరలింపులో అక్రమాలు
* శాసనసభలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ
* ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్
* మిషన్ కాకతీయలో హైదరాబాద్ చెరువులను చేర్చాలని విజ్ఞప్తి
సాక్షి,హైదరాబాద్: గోదావరి జలాలను హైదరాబాద్‌కు తరలించే పథకంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, దీనిపై వెంటనే ప్రభుత్వం విచారణ జరపాలని శాసనసభలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘ఏదైనా ప్రాజెక్టు చేపడితే ముందుగా నీటి కేటాయింపు, పర్యావరణ అనుమతులు తీసుకోవాలి. కానీ, అవేవీ లేకుండానే గోదావరి నీటిని హైదరాబాద్‌కు తరలించే పనికి సంబంధించి పైప్‌లైన్ నిర్మాణం చేసేస్తున్నారు. ఇప్పటికే రూ.2 వేల కోట్లు ఖర్చు చేశారు. ఇందులో భారీ అవినీతి జరిగింది.’ అని అక్బరుద్దీన్ పేర్కొన్నారు.
దాదాపు 2,300 చెరువులు హైదరాబాద్ చుట్టూ ఉన్నాయని, మిషన్ కాకతీయ పథకంలో హైదరాబాద్ పరిసర చెరువులను కూడా చేర్చాలని కోరారు. పాతనగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తన నియోజకవర్గంలో 100 ఎకరాలు కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయని, పేదల గృహనిర్మాణానికి వీటిని రక్షిస్తుంటే తనపై హత్యాయత్నం జరిగిందన్నారు. పాత నగరంపై తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాము తలుచుకుంటే పాత నగరం మీదుగా వెళ్తున్న కృష్ణా పైపులైన్ల నుంచి ఒక్క చుక్క నీరు కూడా ముందుకు వెళ్లకుండా అడ్డుకోగలమని హెచ్చరించారు. కానీ, ఆ పని తాము చేయబోమని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధికి సీఎం కృషి చేయటం అభినందనీయమని, అయితే అదే సమయంలో పహాడీషరీఫ్ దర్గా, మెదక్ చర్చిలను కూడా అభివృద్ధి చేసి అన్ని మతాలపై సమదృష్టి చూపాలని సీఎంకు సూచించారు. రంజాన్, క్రిస్టమస్ తరహాలో మరుసటి రోజు కూడా శివరాత్రికి సెలవు ప్రకటించాలని కోరారు.
వైఎస్‌లా పనిచేయండి
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రతి ముస్లిం జీవి తాంతం మరిచిపోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి మాత్రమేనని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో పేద ముస్లిం విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుంటున్నారన్నా, మంచి ఉద్యోగాలు పొంది తమ కాళ్లపై తాము నిలబడుతున్నారన్నా అది నాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పుణ్యమేనని తెలిపారు. ముస్లిం లకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాకుం డా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో పేద విద్యార్థులను ఆదుకునేందుకు అవకాశం కల్పించారన్నారు. ప్రతి ముస్లిం ైవె ఎస్‌ఆర్ సం క్షేమ పథకాలను గుర్తుపెట్టుకుంటార న్నారు.
కరువు మండలాలను ప్రకటించాలి: వామపక్షాలు
వర్షాభావంతో తెలంగాణలో కరువు పరిస్థితు లు నెలకొన్నాయని.. రాష్ట్రంలోని 441 మండలాలను వెంటనే కరువు మండలాలుగా ప్రకటించాలని వామపక్ష ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ‘రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. బడ్జెట్లో ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. ఈ ఆత్మహత్యలపై నిజనిర్ధారణ కమిటీ వేయండి. రుణమాఫీ కింద సర్కారు కేవలం 25 శాతం చెల్లించడంతో కొత్త రుణాలు ఇవ్వకుండా బ్యాంకులు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి.’ అని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ అన్నారు. తెలంగాణలో దాదాపు 800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని సున్నం రాజయ్య తెలిపారు. చనిపోయిన రైతు కుటుం బాలను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.5 లక్ష ల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలనిడిమాండ్ చేశారు.
సకల జనుల బడ్జెట్: టీఆర్‌ఎస్
ఉద్యమంలో పాల్గొన్న సకల జనుల ప్రయోజనాలు నెరవేరేలా ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించిందని టీఆర్‌ఎస్ శాసన సభ్యుడు వేముల వీరేశ్ అన్నారు. రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టినా.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలపై ఒక్క పైసా భారం కూడా మోపలేదని మరో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి సహకరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.