
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై సమస్యను పరిష్కరించామని, ప్రస్తుతం వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేదని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం పేర్కొంది. ఈ మేరకు తమ అధికారిక ట్వీటర్‌లో వివరాలు వెల్లడించారు. తెలుగు తల్లి ఫై ఓవర్- లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఆయిల్ ప్రభావం కారణంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దాదాపు 30 బైకుల వరకు ఫ్లై ఓవర్ ప్రాంతంలో బైకులు స్కిడ్ అయి (జారిపోయి) పడటంతో కొందరు ద్విచక్ర వాహనదారులకు గాయాలయ్యాయి.
దీంతో కొన్ని గంటలపాటు ఫ్లై ఓవర్ పైకి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. చిరు జల్లులు పడటంతో దుమ్ము, దూళి అంతా కలిసి నూనే వ్యర్థాలుగా మారడంతో వాహనదారులు బైక్‌తో సహా కింద పడిపోయారు. సోషల్ మీడియాలో ఇంకా ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయని, కానీ ప్రస్తుం ఫ్లై ఓవర్‌పై వాహనాలు తిరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి వీడియోను పోస్ట్ చేశారు.